Solar power generation: దేశవ్యాప్తంగా పలు థర్మల్ కేంద్రాల్లో సౌర విద్యుదుత్పత్తి చేసి బొగ్గు వినియోగం తగ్గించాలని కేంద్రం కీలక ఆదేశాలిచ్చింది. సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుతో బొగ్గుతో ఉత్పత్తి చేసే రోజుకు 3,729 మిలియన్ యూనిట్ల(ఎంయూ) థర్మల్ కరెంటు ఆదా అవుతుందని కేంద్ర విద్యుత్‌శాఖ వివరించింది. 2025 నాటికి దేశవ్యాప్తంగా అన్ని థర్మల్ కేంద్రాల్లో కలిపి మొత్తం 58 వేల ఎంయూల విద్యుత్ ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని, దీని భర్తీకి ఇవే కేంద్రాల్లో అదనంగా 30వేల మెగావాట్ల సౌర విద్యుత్‌కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. వీటి ఏర్పాటుతో థర్మల్ కేంద్రాల్లో ఏటా 3.47 కోట్ల టన్నుల బొగ్గు వినియోగం తగ్గుతుంది. ఇంత బొగ్గును మండించి బూడిద చేయడం ద్వారా బయటికి వచ్చే 6.02 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు గాలిలోకి విడుదల కాకుండా నివారించవచ్చని, పర్యావరణాన్ని కాపాడవచ్చని వివరించింది.
2030నాటికి 30 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి:దేశంలో 2030 నాటికి 5 లక్షల మెగావాట్ల సంప్రదాయేతర ఇంధనం(ఆర్‌ఈ) ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నందున ఇందులో సుమారు 30 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి చేయాలని తెలిపింది. తాజా ఆదేశాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన థర్మల్ కేంద్రాల్లో 17,258, రాష్ట్ర ప్రభుత్వ కేంద్రాల్లో 6,427, ప్రైవేటు కేంద్రాల్లో 6,343 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సౌర విద్యుదుత్పత్తి చేయాలని కేంద్రం పేర్కొన్న థర్మల్ కేంద్రాల్లో తెలంగాణలోనివి నాలుగు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)కు చెందిన కొత్తగూడెం(పాత, కొత్త), భూపాలపల్లితో పాటు సింగరేణి సంస్థకు చెందిన మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని థర్మల్ కేంద్రాల్లో మొత్తం 1,985 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్రాలను 2025కల్లా ఏర్పాటుచేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ కేంద్రాలను ఒకేసారి కాకుండా ఏటా కొన్ని మెగావాట్ల సామర్థ్యం చొప్పున రాబోయే మూడేళ్లలో ఏర్పాటుకు అవకాశమిచ్చింది. తెలంగాణలో 2023-24 చివరికల్లా 397 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పాల్సి ఉంటుంది.