"అన్నా.. నాకు షిఫ్టుల్లో పనిచేయడం కష్టంగా ఉంటోంది. ఏం జేయాల్నే.." అంటూ ఒక కార్మికుడు.. "నాకు మంచి క్వార్టరు కేటాయించాల్నంటే ఏం చేయాలే.." మరో కార్మికుడు."గీ భూగర్భ గని నుంచి బయట పడి సర్ఫేస్‌లో పని చేయాలంటే ఎట్లానే.." ఇది మరో కార్మికుడి ప్రశ్న.? అన్నింటికీ దొరికే సమాధానం ఒక్కటే. ఏం లేదన్నా.. మన యూనియన్ నాయకుని దగ్గరికి పోతే పని అవుడు కష్టం.. పోయినా చాలా టైం పడుతది. సక్కగా మన ఎమ్మెల్యేనో, ఎంపీనో, ఇంకా పలుకుబడి ఉంటే మంత్రితోనో చెప్పించుకోవే. అనే సమాధానం ఎవర్ని అడిగినా వస్తుంది.
గని స్థాయిలో నాయకత్వాలను మార్చాలన్నా.. ప్రజా ప్రతినిధుల జోక్యం తప్పనిసరి అవుతోంది. మెజారిటీ ఉద్యోగులు, కార్యకర్తలు ప్రజా ప్రతినిధులనే ఆశ్రయిస్తుండటంతో వారికీ కాదనలేని పరిస్థితి. వారు కార్మిక ఓటర్లే కాకుండా, సాధారణ ఎన్నికల్లో గెలిపించిన వారైరి. కాదంటే ఇక మిమ్మల్ని గెలిపించుకుంది ఇందుకేనా? అని సూటిగా ప్రశ్నించేతత్వం సింగరేణి ఉద్యోగులది. దీంతో ఇతర సమస్యలకన్నా సింగరేణి ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవాల్సి వస్తోంది.
ఒక్క పనికి నలుగురి సిఫారసులు
ముఖ్యమంత్రి చొరవతో సింగరేణిలో కారుణ్య నియామకాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఫలితంగా సింగరేణిలో నిరక్షరాస్యుల స్థానంలో కార్మికుల వారసులు చేరుతున్నారు. కొత్తగా బదిలీ వర్కర్లుగా, జనరల్ మజ్దూర్లుగా పనిచేస్తున్న వారిలో 70 శాతానికి పైగా ఉద్యోగులు డిగ్రీ, ఆపైన చదువుకున్నవారే ఉన్నారు. సాధారణ డిగ్రీలతో పాటు బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదివినవారు సైతం ఉన్నారు. కుటుంబం కోసం, స్థిరమైన ఉద్యోగం ఉంటుందనే ఉద్దేశంతో అనేక మంది ఉన్నత చదువులు చదివినా సింగరేణిలో కిందిస్థాయి ఉద్యోగాల్లో చేరుతున్నారు. మూడు షిఫ్టుల్లో పనిచేయలేక, జనరల్ షిఫ్టులో ఇంజినీరింగ్, సర్వే, రక్షణ, తదితర విభాగాల్లో తమకు చోటు కల్పించాలంటూ పైరవీలు చేస్తున్నారు. ఎవరో ఒకరు చెబితే ఫరవాలేదు. ఒక్కొక్కరికి ముగ్గురు, నలుగురు ప్రజాప్రతినిధులు చెప్పడం, ఇటు కార్మిక నాయకులు సిఫారసు చేస్తుండటంతో గనుల నిర్వహణ అధికారులు ఎవరిమాట వినాలో తెలియక సతమతమవుతున్నారు.
నాయకత్వం కోసమూ పైరవీలే..
ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుంటేనే సింగరేణిలో కార్మికుల పనులు జరుగుతాయనే భావన బలంగా నాటుకుపోవడంతో గనుల స్థాయిలో నాయకత్వ బాధ్యతల కోసమూ కిందిస్థాయి కార్యకర్తలు, నేతలు పైరవీల కోసం అర్రులు చాస్తున్నారు. ఒక గనిలో పిట్ కార్యదర్శి పోస్టు కావాలన్నా ఆ సంఘం అగ్రనేతలు గానీ, ఏరియా స్థాయి నాయకత్వంగానీ తగినవారిని ఎంపిక చేసుకునే పరిస్థితిలేదు. కార్మిక నేతల ప్రమేయం లేకుండా ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ఫోన్లు చేయించుకోవడం. మా వాడికి ఫలానా చిన్న పోస్టు ఇప్పించి పెట్టన్నా.. అని నాయకత్వానికి చెప్పించడం పరిపాటిగా మారింది.
ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి