మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిరవధిక సమ్మెలో భాగంగా కార్మికులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు పూలు అందజేసి సమ్మెకు మద్దతు పలకాలని కోరారు. డిపోలోకి వెళ్లి పూలు అందిస్తామని, శాంతియుతంగా కార్యక్రమం నిర్వహిస్తామంటూ కార్మికులు డిపోలోకి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. డిపోలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున లోపలికి అనుమతించబోమని పోలీసులు చెప్పారు. బయట రహదారిపై డ్రైవర్లు కండక్టర్లకు పూలు అందించి సహకారం కోరారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను బెదిరిస్తున్నారనే నెపంతో ఇద్దరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీసులు స్టేషన్కు తరలించారు.
సహచరుల అరెస్టు విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు రహదారిపై రాస్తారోకో జరపగా... రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. దీంతో స్థానికులు, ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతియుత పద్ధతి అంటూనే కార్మికులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను బెదిరిస్తున్నారని సీపీ తెలిపారు. ఆందోళనకారులను వీడియో తీశామని... వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
ఆర్టీసీ కార్మికుల నిరసనను భగ్నం చేసిన పోలీసులు - ఆర్టీసీ కార్మికుల నిరసనను భగ్నం చేసిన పోలీసులు
మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. డిపోలోకి వెళ్లి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు పూలు ఇచ్చి సమ్మెకు మద్దతు కోరతామని వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిరసనగా ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో చేశారు.
ఆర్టీసీ కార్మికుల నిరసనను భగ్నం చేసిన పోలీసులు
ఇవీ చూడండి: 'ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రైవేటు బస్సులు'