విద్యుత్ బిల్లు తీసే వ్యక్తి మీటర దగ్గరకు వెళ్లగానే ఆతృతగా అతని చేతిలోని మెషీన్ వంక తదేకంగా చూస్తుంటాం... ఈ నెలలో ఎంత విద్యుత్ వాడి ఉంటాం... బిల్లు ఏమాత్రం వచ్చుంటుందా అని లెక్కలేసుకుంటాం. మెషీన్లోనుంచి బిల్లు వచ్చి.. అతని నుంచి తీసుకోగానే ఎంతొచ్చిందా అని వెతికేసుకుంటాం... కొద్దోగొప్పో ఎక్కువొస్తే.. ఏమీ వాడలేదు కదా ఇంతెందుకొచ్చిందబ్బా... ఈ నెల నుంచి వాడకం తగ్గించుకోవాలని ప్రణాళికలు వేసుకుంటాం. ఇది సాధారణంగా ప్రతి నెలా జరిగేదే. అయితే ఓ గృహిణి తమ నివాసానికొచ్చిన బిల్లు చూసి కళ్లు బైర్లు కమ్మాయి. గత నెలకంటే పది రూపాయలు పెరిగితే ఎందుకు పెరిగిందబ్బా అని చూసుకునే గృహాలకు లక్షల్లో బిల్లు వస్తే ఏంటి పరిస్థితి. అలాంటి ఘటనే జరిగింది మంచిర్యాల జిల్లా కేంద్రంలో
Electricity Bill: బిల్లును పట్టుకోగానే షాక్ కొట్టింది..
విద్యుత్ బిల్లును పట్టుకోగానే ఓ వినియోగదారుకి షాక్ తగిలింది. అది విద్యుత్ షాక్ కాదు.. విద్యుత్ చార్జీషాక్. అవును మరి ఆ బిల్లులో ఉన్నది అక్షరాలా రూ.6,69,117. అదేదో పరిశ్రమకో.. వాణిజ్య సముదాయానికి వచ్చిన బిల్లనుకుంటే పొరపాటే. కేటగిరీ 1లోని ఓ సాధారణ గృహానికి వచ్చిన బిల్లు. విద్యుత్ సిబ్బంది నిర్వాకంతో మరి షాక్ కాక ఏమికావాలి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమీనగర్లో జరిగింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమీనగర్కు చెందిన ముప్పిడి మధురవాణి నివాసానికి సోమవారం విద్యుత్ సిబ్బంది వచ్చి మీటర్ స్కాన్ చేసి బిల్లు ఇచ్చి వెళ్లిపోయారు. తీరా బిల్లు చూస్తే పెద్ద సంఖ్య కనిపించింది. ప్రతినెలా రెండు నుంచి మూడు వేల లోపు వచ్చే బిల్లు ఈ సారి లక్షల్లో చూసి ఆమె షాకైంది. ఒకటా రెండా ఏకంగా రూ.6,69,117 బిల్లు వచ్చింది. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇంత బిల్లు వచ్చిందని వాపోతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో ఇష్టారాజ్యంగా బిల్లులు వేస్తుంటే ఎలా కట్టాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:kcr: ఆచార్య జయశంకర్ యాదిలో సీఎం కేసీఆర్