ప్రాణహిత తీరప్రాంతం శిలాజాలకు పెట్టింది పేరు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని శిలాజాలు పురాతన చరిత్ర కలిగి ఉండడంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రాణహిత తీరాన ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వివిధ ఆకృతుల్లో దర్శనమిస్తూ.. ఆకర్షిస్తున్నాయి. చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే వృక్ష, జంతు జాతులు శిలాజాలు.. సంరక్షణ లేక క్రమేణా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కొందరు వీటిని తరలించుకుపోతున్నా.. అధికారుల్లో చలనం ఉండడం లేదని.. స్థానికులు ఆరోపిస్తున్నారు. పురాతన సంపదను కాపాడి పర్యటక ప్రాంతంగా చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చరిత్రకు సజీవ సాక్షాలు
వేమనపల్లి మండలం సుంపుటం గ్రామ శివారులోని ప్రాణహిత తీరంలో తాబేలు, నత్తగుళ్ల శిలాజాలకు ఈ తీరం నిలయంగా మారింది. ఇక్కడ లభించిన చాలా శిలాజాలను హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో భద్రపరిచారు. గతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వీటిని హైదరాబాద్కు తరలించారు. 1980 సంవత్సరంలో యాదగిరి అనే భూగర్భ శాస్త్రవేత్త వీటిని గుర్తించారు. మంగేనపల్లి, రాజారాం అటవీ ప్రాంతంలో రాకాశి బల్లి అవశేషాలను అప్పట్లో బ్రిటిష్ శాస్త్రవేత్తలు గుర్తించారు. 14 మీటర్ల పొడవు 4.06 మీటర్ల ఎత్తు కలిగిన వీటిని అతి పెద్ద డైనోసార్గా గుర్తించారు. అనంతరం హైదరాబాద్కు తీసుకెళ్లి మ్యూజియంలో భద్రపరిచారు. భూ ఉపరితలంపై జల ప్రళయాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం వల్ల ఇవి ఏర్పడ్డాయని బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలోనే స్పష్టం చేసింది.
ఆకట్టుకుంటున్న ఆకృతులు
ప్రాణహిత నదీ తీరప్రాంతం అందమైన శిలాజాలతో ఆకట్టుకుంటోంది. నది ఉప్పొంగినప్పుడు శిలాజాలు తరచూ బయటపడుతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. గ్రహాకారం, తాబేలు, గోళాకారం, చేప, అర్ధచంద్రాకారం, కర్ర శిలాజాలు ఇక్కడ వేల సంఖ్యలో ఉన్నాయని చెప్పారు. కొందరు వీటిని అక్రమంగా తరలిస్తున్నారని.. ఇంటి నిర్మాణంలో అందం కోసం ముంబయి, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తీసుకుపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పురావస్తు శాఖ కదలాలి
నదీతీరంలో బయటపడుతున్న శిలాజాలను కాపాడడం కోసం పురావస్తు శాఖ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వీటిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించి.. పరిశోధనలు చేస్తే.. శిలాజాలు, ఈ ప్రాంత చరిత్ర బాహ్య ప్రపంచానికి తెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.