మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని దాడి తండాకు చెందిన 10 కుటుంబాలు గత కొంత కాలంగా ముంబయికి వలస వెళ్లి అక్కడే జీవనోపాధి పొందుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక సొంత గ్రామానికి బయలుదేరారు. వాళ్లు తండాకు వస్తే తమకు ఎక్కడ కరోనా వస్తుందోనన్న భయంతో తండావాసులు... అధికారులకు సమాచారం అందించారు.
సొంతూరు భయపడితే.. పక్కూరు అండగా నిలిచింది.! - food distribution
పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్న వలస కూలీలకు అండగా ఉంటున్నారు పలువురు దాతలు. సొంత తండావాసులే భయపడి అధికారులను సంప్రదిస్తే.. పక్క గ్రామస్థులు వచ్చి ఆపన్నహస్తం అందించిన అరుదైన ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో జరిగింది.
వెంటనే స్పందించిన అధికారులు దేవరకద్ర కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆ కుటుంబాలకు ప్రత్యేక వసతి కల్పించారు. వారికి అవసరమైన నిత్యావసర సరుకులు అందించారు. అధికారుల పిలుపుతో.. మండలంలోని చిన్న రాజమూర్ గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి... ప్రభుత్వం అందించిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తహసీల్దార్ జ్యోతి ఆధ్వర్యంలో అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.
చిన్న రాజమూర్ గ్రామస్థులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు. వలస కుటుంబాలకు ఎమ్మెల్యే నిత్యావసర సరుకులు అందజేశారు.