TS Teachers Transfers : రాష్ట్రంలో 317 జీవో ప్రకారం చేపడుతున్న స్థానిక కేడర్ కేటాయింపుల ప్రక్రియపై ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తున్నాయి. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లా డైట్ కళాశాలలో ఉపాధ్యాయులు పెద్దఎత్తున అధికారులకు విన్నవించుకుంటున్నారు. సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేపడుతున్నందున సొంత జిల్లాల్లో పనిచేసే అవకాశం కోల్పోతున్నట్లు వాపోతున్నారు. 6 నుంచి పదో తరగతి వరకు ఎక్కడ చదివితే ఆ ప్రాంతాన్నే స్థానిక జిల్లాగా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత విధానంతో సీనియారిటీ ఉన్న వారు తమకు నచ్చిన జిల్లాను ఎంచుకుంటున్నారని, వెనకబడినవారు మిగిలిన జిల్లాల్లో పనిచేయాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం..
Telangana Teachers Transfers: మరోవైపు సీనియారిటీ జాబితా రూపకల్పన తప్పుల తడకగా ఉందని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. జాబితా రూపకల్పనలో డీఎస్సీ మార్కులను జత చేయకపోవడంపై పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మార్కులను పరిగణలోకి తీసుకోని కారణంగా సీనియారిటీలో వెనకబడ్డామని కొందరు వాపోతున్నారు. ఎస్జీటీలుగా కొన్నేళ్లు పనిచేసి.. స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల సీనియారిటీని.. పదోన్నతి పొందిన కాలం నుంచి లెక్కిస్తున్నారని మరికొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సరైన న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నారు.
"ఈ జీవోతో స్థానికులు స్థానికేతరులుగా మారే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా జూనియర్లు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి. స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోట్ అయిన వాళ్లు.. వారు ప్రమోషన్ పొందిన తేదీనే ప్రాముఖ్యంగా తీసుకోవడం వల్ల వారు అంతకు ముందు ఎన్నేళ్లు పనిచేసినా.. సీనియారిటీ జాబితాలో కింద ఉంటున్నాం. మెరిట్ ప్రకారం.. స్థానికత ఆధారంగా బదిలీ చేయాలి. ఇప్పుడున్న ఐచ్ఛికాల్లో భార్య, భర్త అనే ఆప్షన్లు లేవు. ఇలా అయితే భార్య ఒకచోట.. భర్త మరోచోట ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి."