తెలంగాణ

telangana

ETV Bharat / state

కాలనీ అంతా నిఘా నేత్రాలతో నిత్యం పహారా - wireless

ఫేస్​బుక్​ ద్వారా పరిచయమైన వ్యక్తి చేతిలో పద్నాలుగేళ్ల బాలిక ఇటీవలే హత్యకు గురైన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేవలం 24 గంటల్లో నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు. సీసీటీవీల ప్రాధాన్యాన్ని స్వయంగా గుర్తించిన ఆ కాలనీ వాసులు... ఏకంగా వైర్​లెస్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు.

నిఘా నేత్రాలతో

By

Published : Sep 24, 2019, 8:46 PM IST

నిఘా నేత్రాలతో నిత్యం రక్షణ.....

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఇటీవల పద్నాలుగేళ్ల బాలిక కనిపించకుండా పోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు అందుకున్న స్థానిక సీఐ ఆదిరెడ్డి సీసీటీవీ దృశ్యాలను శోధించారు. బాలిక ఓ కారులో ఎక్కి వెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో నమోదైంది. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. బాలికను హత్య చేసినట్లుగా నిందితుడు అంగీకరించాడు. ఇలా దర్యాప్తంతా ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ముగిసింది.

ఈ కేసును చేధించడంలో కీలక భూమిక పోషించింది కేవలం సీసీటీవీ దృశ్యాలే. ఈ ప్రక్రియనంతా స్వయంగా పోలీసుల దగ్గరుండి గమనించిన హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు.. సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని గుర్తించారు. వెంటనే సొంతంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు.

తొలిసారి వైర్​లెస్​ విధానం....

మహబూబ్​నగర్ జిల్లాలో తొలిసారిగా జడ్చర్ల పోలీసు ఠాణా పరిధిలో సీసీటీవీల అమరికలో వైర్​లెస్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ విధానంలో వానలు, గాలులు వచ్చినప్పుడు వైర్లు తెగిపోతాయన్న ఇబ్బంది ఇందులో ఉండదు. పగలు, రేయి స్పష్టంగా దృశ్యాలు కనిపించే నాణ్యమైన కెమెరాలను పోలీసులు ప్రస్తుతం వినియోగిస్తున్నారు.

కేసులను ఛేదించే విషయంలోనే కాదు.. ఎలాంటి శ్రమ లేకుండా పోలీస్​ స్టేషన్ నుంచే ఆయా ప్రాంతాలపై నిరంతర నిఘా పెట్టేందుకు సీసీ కెమెరాలు ఉపయోగ పడతాయని పోలీసులు చెబుతున్నారు. తద్వారా నేరం జరిగిన తర్వాత దర్యాప్తు కంటే... నేరాల నియంత్రణలోనూ సీసీ కెమెరాలు బాగా పనిచేస్తాయని సూచిస్తున్నారు. హౌజింగ్ బోర్డు కాలనీ లాగానే పట్టణ, పల్లెవాసులు ముందుకొచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి:దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details