విజయదశమి రోజున బతుకుతెరువుకు తోడ్పడే పనిముట్లు, ఆయుధాలు, వాహనాలను దైవంగా భావించి వాటిని పూజించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ప్రతి ఏడాది ఆర్టీసీ సంస్థలోని అన్ని డిపోల్లో కార్మికులు, ఉద్యోగులు.. పనిముట్లు, ఆయుధాలకు పెద్ద ఎత్తున పూజలు చేసి బస్సులను అలంకరించేవారు. ఏడాది పాటు ఎలాంటి ప్రమాదం జరగకుండా దీవించమని దుర్గాదేవిని వేడుకునేవారు. ఈసారి సమ్మె కారణంగా ఆర్టీసీ కార్మికులు ఎలాంటి పూజలు నిర్వహించలేదు.
పండుగకు దూరం
సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్ డిపోలలో ఉన్న 10 వేల 400 బస్సులు ఈ ఏడాది పూజకు నోచుకోలేదు. సంస్థ మనుగడతో పాటు తాము సుఖసంతోషాలతో ఉండాలని విజయ దశమి రోజున పెద్ద ఎత్తున పూజలు నిర్వహించే వారమని సంఘాల నేతలు గుర్తు చేసుకున్నారు. మూడు రోజులపాటు కోలాహలంగా నిర్వహించే ఈ పండుగకు తామంతా దూరమయ్యామని ఆవేదన చెందారు.