రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలను, దోపిడీ, దగను కేవలం బహుజన సమాజ్ పార్టీ మాత్రమే అంతం చేస్తుందని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహుజన రాజ్యాధికార సంకల్ప సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఏడేళ్ల నుంచి గుర్తుకు రాని దళితులకు ఇప్పుడు రకరకాల భోజనాలు పెడుతున్నారని.. దళిత బంధు ఇస్తామంటున్నారని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దళితుల జీవితాలను ధరణి పోర్టల్ నాశనం చేస్తోందన్న ఆయన.. ఆ పోర్టల్ వారికి ఉరితాడులా మారిందన్నారు. తాత ముత్తాతల నుంచి అనుభవిస్తున్న అసైన్డ్ భూములను ధరణి పోర్టల్‌లో లాక్ చేసి పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో 80 వేల అప్లికేషన్‌లు ఉన్నా.. ఏ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
కోకాపేట, బంజారాహిల్స్ మీ భూములను భద్రంగా కాపాడుకుని అమ్ముకుంటున్నారని, గ్రామాల్లోని దళితుల భూములను మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని ధ్వజమెత్తారు. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు అసైన్డ్ భూములలో నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధు కింద 10 లక్షలు, బర్రెలు, ట్రాక్టర్లు ఇస్తామంటున్నారని.. కానీ బహుజనులకు కావాల్సిన ఉద్యోగాలు, వ్యాపారాలను ఇవ్వాలన్నారు. గురుకులాల కార్యదర్శిగా ఉండగా.. మహబూబ్‌నగర్ జిల్లాలోని ముసుగు సంస్థలతో కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు ఫిర్యాదు చేయించారని మండిపడ్డారు. 26 సంవత్సరాల పాటు ప్రాణాలకు తెగించి నిస్వార్థంగా దేశ సేవ చేశానన్నారు. ఇప్పడు రాజ్యాధికారం కోసం.. ఏనుగు ఎక్కబోతున్నానని పేర్కొన్నారు. బహుజన పార్టీలో చేరేందుకు వస్తుంటే గ్రామాలలో తెరాస నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. బహుజనులపై ఒక్క కేసు పెట్టినా.. ఒక్కరి మీద దాడి చేసిన లక్ష మంది మీ ఇంటి ముందు కూర్చుంటారని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఈ సందర్భంగా యువత భారీ ఎత్తున ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీలో చేరారు.