మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పురపాలికలోని బాదేపల్లి, కావేరమ్మపేటలకు వేర్వేరుగా పురపాలికలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. బాదేపల్లి, కావేరమ్మపేట గ్రామపంచాయతీలను కలిపి గతంలోనే జడ్చర్ల పురపాలికను ఏర్పాటు చేశారు. కోర్టు ఆదేశాలతో కావేరమ్మపేటను పురపాలికలో కలపకుండా మేజర్ గ్రామపంచాయతీగానే కొనసాగించారు. గతేడాది డిసెంబర్‌లో కావేరమ్మపేట గ్రామపంచాయతీ పాలక వర్గం గడువు ముగియటంతో జడ్చర్ల పురపాలికలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వార్డుల విభజన ఆపేయండి...
ప్రత్యేక పురపాలిక ఏర్పాటు కోసం పలుమార్లు జిల్లా యంత్రాంగాన్ని అభ్యర్థించారు. ఇదే విషయంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయటంతో న్యాయస్థానం సైతం ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని చట్టబద్ధంగా వాటి అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవడంతో పాటు వార్డుల విభజనను కూడా ఆపేయాలని కావేరమ్మపేట వాసులు కోరుతున్నారు. ప్రజానుకూల నిర్ణయం తీసుకుని వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.