మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తుపాకీతో గాలిలో కాల్పులు జరిపిన రవి, కన్నయ్య అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ కేంద్రమైన తిమ్మసానిపల్లి సమీపంలోని రైల్వే పట్టాల పక్కన తుపాకీ పేలిన శబ్ధం వచ్చినట్టు తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఓ వేడుకల్లో రెండు బృందాల మధ్య జరిగిన గొడవపై పగ తీర్చుకునేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తుల వద్ద రవి తుపాకీ కొన్నాడని మహబూబ్ నగర్ డీఎస్పీ వెల్లడించారు. తమపై దాడి చేసిన వారిని మట్టుబెట్టేందుకు దీపావళి తర్వాత ప్రణాళిక రూపొందించారని వివరించారు. శనివారం తెల్లవారుజామున తుపాకీతో ప్రాక్టీస్ చేస్తుండగా శబ్ధం రావడంతో... పోలీసులు అప్రమత్తమయ్యారు.పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశామని వివరించారు. వారి నుంచి కంట్రీ మేడ్ పిస్టల్‌తో పాటు నాలుగు రౌండ్ల బుల్లెట్లు, ఒక తపంచా స్వాధీనం చేసుకున్నారు. వారిని పట్టుకోకపోయి ఉంటే మరో హత్య జరిగి ఉండేదని పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్‌లో తుపాకీ కలకలం - two people arrested
మహబూబ్‌నగర్‌లో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. గాలిలో కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
మహబూబ్‌నగర్‌లో తుపాకీ కలకలం