రోడ్డు పక్కన ఆధార్, ఏటీఎమ్ కార్డుల కుప్పలు Piles of ATM, Aadhaar cards on the roadside in jadcherla:వినియోగదారులకు అందాల్సిన ఆధార్ కార్డులు, ఏటీఎం కార్డులు రోడ్డు పక్కన కుప్పలుతెప్పలుగా పడి ఉన్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో చోటుచేసుకుంది. జడ్చర్ల-తిమ్మాజిపేట రహదారిలో నాగసాల చెరువు సమీపంలో కట్టలు, కట్టలుగా ఆధార్, ఏటీఎం కార్డులు ఉండడాన్ని గమనించిన కొందరు స్థానికులు రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది వాటిని పరిశీలించారు. పోస్టుల ద్వారా వినియోగదారులకు చేరాల్సిన విలువైన ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులతో పాటు పలు కవర్లు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం వాటిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ కార్డులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఎంతో విలువైన ఆధార్ కార్డులు బహిరంగ ప్రదేశంలో పడేయడం వల్ల అవి అసాంఘిక శక్తులకు చేరితే నష్టం ఉన్నందున ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి వీటిని అక్కడ పడేసినవాళ్లెవరో త్వరలోనే తెలుసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
"ప్రజలకు అందాల్సిన ఆధార్‌కార్డులు, ఏటీఎమ్కార్డులు, చాలన్లు సంచిలో ముఠా కట్టి నాగసాల చెరువు సమీపంలో పడేశారు. భారత ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు నేడు ఎంతో ముఖ్యమైంది ప్రతి పథకానికి ఇదే ఆధారం. అక్రమార్కుల చేతికి చిక్కితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చేరాల్సిన వారికి చేర్చకుండా ఇక్కడ పడేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి." - విజయ్
ఇవీ చదవండి