Phone Conversations Between Guvvala Balaraju and MP Ramulu: అచ్చంపేట శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు-ఎంపీ రాములుకు మధ్య జరిగిన సెల్‌ఫోన్ సంభాషణలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రాములు, అతని కుమారుడు భరత్ ప్రసాద్‌కు సంబంధించిన బ్యానర్లను తొలగించాలని గువ్వల బాలరాజు.. ఎంపీ రాములును హెచ్చరించారు. ఆ ఆడియో ఒకటి అచ్చంపేట నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
అధికార పార్టీలోనే ఉన్నా విభేదాలు కొనసాగుతున్నాయి: కాబోయే ఎంపీ, కాబోయే ఎమెల్యే అంటూ నియోజకవర్గంలో పలు ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. భరత్‌కు సంబంధించి అలాంటి బ్యానర్లు కనిపించవద్దని, లేదంటే పార్టీ కన్నా ముందు తనకున్న అధికారాలను వినియోగిస్తానని బాలరాజు చెప్పడం, ఈ వ్యవహరాన్ని పార్టీ దగ్గరే తేల్చుకుంటానని రాములు దానికి బదులివ్వడంతో నాగర్ కర్నూల్ జిల్లాలో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ అధికార పార్టీలోనే ఉన్నా.. చాలా కాలంగా గువ్వల బాలరాజు-ఎంపీ రాములు వర్గాలకు మధ్య అచ్చంపేట నియోజకవర్గంలో విబేధాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
వైరల్‌గా మారిన ఫోన్ సంభాషణలు: నాగర్ కర్నూల్ జడ్పీ ఛైర్మన్ పదవిని రాములు కుమారుడు భరత్ ప్రసాద్ రెండుసార్లు ఆశించి భంగపడ్డారు. మొదట్లో అవకాశం చేజారినా.. ఇటీవల జరిగిన జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లోనైనా తనకు అవకాశం దక్కుతుందని భావించారు. కానీ అధిష్ఠానం మరొకరికి ఆ పదవి కట్టబెట్టడంతో రాములు సహా భరత్ ప్రసాద్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచి బాలరాజు సొంత నియోజకవర్గమైన అచ్చంపేటలో వారు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు వారి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా.. గువ్వల అభిమానులు వాటిని తొలగించినట్లు తెలుస్తోంది. ఫ్లెక్సీల వివాదం ముదరడంతో బాలరాజు నేరుగా రాములుకు ఫోన్ చేసి హెచ్చరించినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.