Government measures to control dogs: హైదరాబాద్‌లో కుక్కుల దాడిలో బాలుడు మరణించిన ఘటన నేపథ్యంలో పురపాలికల్లో శునకాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో పురపాలక సిబ్బంది రంగంలోకి దిగారు. ఆహార, మాంస వ్యర్థాలను తిని ఆకలి తీర్చుకునే కుక్కలు.. అవి దొరకని సమయంలో మనుషులపై దాడికి దిగుతున్నాయి.
ఈ కారణంగా మహబూబ్‌నగర్ పట్టణంలో మాంస, ఆహార వ్యర్థాలను బయట పారేయవద్దని డబ్బాల్లో నిల్వ ఉంచుకుని మున్సిపాలిటీ వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించాలని పురపాలిక అధికారులు హోటళ్లు, ఆహార, మాంస విక్రయ దారులకు నోటీసులు జారీ చేశారు. అయితే వ్యర్థాలను తీసుకు వెళ్లేందుకు వాహనాలు పంపాలని విక్రయదారులు పురపాలక అధికారుల్ని కోరుతున్నారు.
"మున్సిపల్ అధికారులు చెత్త బుట్టలు ఏర్పాటు చేయాలి. ఉదయం, సాయంత్రం వాటిని డంపింగ్ యార్డ్‌కు తరలించాలి. మూడు రోజులు అవుతుంది నోటిసులు ఇచ్చి.. ఇంత వరకు చెత్త బళ్లు కూడా రాలేదు. వారికి ఫొన్ చేస్తే సరైనా రెస్పాన్స్ లేదు. ఆ మాంసం ముక్కలు మా దగ్గర ఉంచుకుంటే వాసన వస్తోంది. అధికారులే వీటికి సరైనా ఉపాయం చూపాలి".-మాంసం విక్రయదారులు
కుక్కల సంఖ్య నియంత్రణ కోసం చర్యలు మొదలయ్యాయి. శునకాల సంతతి అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి ఫిర్యాదులొస్తే వాటిని అక్కడి నుంచి జంతు జనన నియంత్రణ కేంద్రానికి తీసుకొచ్చి వాసేక్టమీ, ట్యూబెక్టమీ శస్త్రచికిత్సలు చేస్తున్నారు. 5రోజుల పాటు ఆహారం, మందులు ఇస్తున్నారు. రేబిస్ సోకకుండా టీకాలు వేసి.. 5 రోజుల తర్వాత తిరిగి వాటిని ఎక్కన్నుంచి తీసుకు వచ్చారో ఆ ప్రాంతాల్లోనే వదిలేస్తున్నారు. రేబిస్ టీకా వేసినట్లు గుర్తుగా ఎడమ చెవి చివరి భాగాన్ని తొలగిస్తున్నారు.
"కుక్కల నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నాం. వాటి ఉత్పత్తి పెరగకుండా ఇప్పటి వరకు 3వేల 225 వరకు ఆపరేషన్లు చేశాం. పట్టణంలో కుక్కల బెడద ఉందని సమాచారం వస్తే స్వచ్ఛంద సంస్థ ద్వారా వాటికి ఆపరేషన్లు చేసి మరల అక్కడనే విడిచిపెడుతున్నాం".-ప్రదీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్