పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఏర్పాటు చేసిన సంయుక్త విచారణ కమిటీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని దీనిపై విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన చంద్రమౌళేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలానికి చెందిన కోస్గి వెంకటయ్య గ్రీన్ ట్రైబ్యునల్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ట్రైబ్యునల్, వాస్తవ పరిస్థితులపై నివేదిక కోరుతూ వివిధ శాఖల నిపుణులతో సంయుక్త విచారణ కమిటీని నియమించింది. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు కమిటీ 15వ తేదీన నాగర్కర్నూల్ జిల్లాలో, 16న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించింది. రెండో రోజు పర్యటనలో భాగంగా కమిటీ సభ్యులు మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం కర్వేన జలాశయం 13వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన నమూనా చిత్రాలను తిలకించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి దృశ్య సమీక్ష నిర్వహించారు. జడ్చర్ల మండలం పరిధిలో నిర్మాణం చేస్తున్న ఉదండాపూర్ జలాశయం పనులను పరిశీలించారు. జడ్చర్ల, నవాబుపేట మండలాల నుంచి నల్లమట్టిని తరలించిన చెరువులను పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ చెరువులు నుంచి ఉండడంతో అధికారుల వద్ద కమిటీ సభ్యులు సమాచారం అడిగి తెలుసుకున్నారు.
ప్రశ్నల వర్షం.. పొంతనలేని సమాధానాలు..!
ప్రాజెక్టు అనుమతులు, పర్యావరణం, నాణ్యత ప్రమాణాలపై కమిటీ లోతుగా వివరాలు సేకరించింది. సాగునీరు, మైనింగ్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులను కమిటీ సభ్యులు వివిధ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఓ దశలో అధికారులు చెప్పే సమాధానాలకు పొంతన లేకపోవడంతో ప్రాజెక్టు పనులపై సమన్వయం కొరవడినట్లు తెలుస్తోందని కమిటీ సభ్యులు వ్యాఖ్యనించినట్లు సమాచారం. ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా? ఎప్పుడూ తీసుకున్నారు? దేనికోసం తీసుకున్నారు? పర్యావరణ అనుమతులున్నాయా? మట్టిని ఎక్కడి నుంచి సేకరించారు? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొదటి దశలో తాగునీటి కోసం ప్రాజెక్టు పనులకు అనుమతులు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. రెండో దశలో సాగునీటి కోసం పనులు చేపట్టనున్నట్లు వివరించారు. తాగునీటికి అనుమతులు తీసుకోని సాగునీటికి పనులు ఎందుకు చేపట్టారని కమిటీ ప్రశ్నించినట్లు సమాచారం.
అన్ని కోణాల్లోను..