మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గత మూడేళ్లుగా వానాకాలంలో సీజనల్ విషజ్వరాలు విజృంభిస్తున్నా... వాటి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ప్రజారోగ్యశాఖ అధికారులు దారుణంగా విఫలమవుతున్నారు. వానాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా దోమలు, వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలోని శివారు కాలనీలు, విలీన గ్రామాలు పారిశుద్యం విషయంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మురుగు కాల్వలు, సీసీ రోడ్ల వ్యవస్థ అభివృద్ధి కాకపోవడం వల్ల వర్షపు నీరు, మురుగు నీరు ఇళ్ల మధ్యలోని ఖాళీ స్థలాల్లో చేరి దోమలు, ఈగలు ఇతర క్రిమి కీటకాలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఈ కారణంగా ఆ ప్రాంతాల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని... ఏటా ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.
ఇక పట్టణంలో పారిశుద్యం సైతం అధ్వాన్నంగా మారింది. ముఖ్యంగా ప్రేమ్ నగర్, సద్దలగుట్ట, టీడీ గుట్ట, రాజేంద్ర నగర్, బీకే రెడ్డి కాలనీ, శాసాహెబ్ గుట్ట, వీరన్నపేట, రామయ్య బౌలి, హబీబ్ నగర్, పాత పాలమూరు సహా మురికి వాడల్లో గత మూడేళ్లుగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా లాంటి వ్యాధులు అధికంగా నమోదయ్యాయి. ఈ ప్రాంతాలపై మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉన్నా....ఎలాంటి చర్యలు లేవు.