మహబూబ్ నగర్ జిల్లాలో రెవెన్యూ సమావేశ మందిరంలో అధికారులతో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. ఎదిరలోని ప్రభుత్వ వైద్య కళాశాల, మయూరి ఫారెస్ట్‌లో మియావాకి అడవుల పెంపకం, బైపాస్ రహదారి, మహిళా సంఘాల ఉత్పత్తులు, చేనేత ప్రదర్శనను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అటవీ శాఖ కార్యాలయం వద్ద వీధి వ్యాపారుల కోసం నిర్మించిన షాపులను సైతం ప్రారంభిస్తారన్నారు.
అక్కడ సామూహిక గృహ ప్రవేశం..
వీరన్న పేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా మంత్రులు, శాసన సభ్యులు, మండలి సభ్యులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. దివిటి పల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం, భగీరథ కాలనీలో కూరగాయలు, మాంసం మార్కెట్‌ను ప్రారంభిస్తారని స్పష్టం చేశారు.
భౌతిక దూరం పాటిస్తూ
మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. మెడికల్ కళాశాలలో భౌతిక దూరాన్ని పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించాలని కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్‌ను ఆదేశించారు. అటవీశాఖ ముందు ఏర్పాటు చేసిన షాపులను నిరుపేదలకే ఇస్తామన్నారు.