రాష్ట్రంలో ఆక్సిజన్, పడకలు, కరోనాకు మందులు లేవనే ప్రచారం నమ్మవద్దని ప్రజలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ ప్రాంగణంలో మొబైల్ కొవిడ్ క్లినిక్ అంబులెన్సులు(సంచార వాహన వైద్య సేవలు), ప్రైవేటు ఉపాధ్యాయులకు 25 కిలోల బియ్యం పంపణీ, టాస్క్ ఫోర్స్ వాహనాలను ఆయన ప్రారంభించారు. 3 కొవిడ్ మొబైల్ క్లినిక్ అంబులెన్సులను శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే ఇంటికే వచ్చి పరీక్షలు చేస్తారని మంత్రి తెలిపారు. పాజిటివ్ వస్తే హోం ఐసోలేషన్.. అవసరమైతే అదే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తారని స్పష్టం చేశారు.
స్వచ్ఛందంగా సహకరించాలి..
రాష్ట్రంలోనే మొదటి సరిగా ఈ తరహా ప్రయోగం ఇక్కడ చేస్తున్నామని మంత్రి అన్నారు. జిల్లా కేంద్రంలోని రెండు మెడికల్ కళాశాలలు, ఆస్పత్రుల్లో అన్ని వసతులు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ 20శాతం పడకలు కొవిడ్ రోగుల కోసం కేటాయించామని చెప్పారు. జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులో ఉందని తెలిపారు. కర్ఫ్యూకి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా సమయంలో ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని మంత్రి అన్నారు. జిల్లాలో సుమారు రూ.45లక్షల విలువైన బియ్యం, నగదును ప్రైవేటు ఉపాధ్యాయులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఆక్సిజన్, పడకలు, మందులు లేవనే అసత్య ప్రచారాలు నమ్మొద్దు: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇదీ చదవండి:భద్రాద్రిలో కనుల పండువగా సీతారాముల కల్యాణం