తెలంగాణ

telangana

ETV Bharat / state

సమస్యలకు నెలవుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు - ధాన్యం కొనుగోలు కేంద్రాలు

యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని సర్కార్‌ ప్రకటన చేసి పక్షం రోజులు గడుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం సరిపడా కొనుగోలు కేంద్రాలు తెరచుకోకపోగా... ప్రారంభమైన వాటిలోనూ కొనుగోళ్లు సక్రమంగా సాగడం లేదు. కనీస వసతులు లేక ఎండతీవ్రతకు రైతులు అల్లాడిపోతున్నారు. అకాల వర్షాల భయంతో కొందరు రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కష్టాలపై కథనం.

many problems in paddy procurement centers at mahaboobnagar
many problems in paddy procurement centers at mahaboobnagar

By

Published : May 1, 2022, 5:11 AM IST

సమస్యలకు నెలవుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు

యాసంగిలో పండిన ధాన్యాన్ని ప్రతిగింజ కొంటామని చెప్పిన తెరాస సర్కారు... ఆ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. 5 నుంచి 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందన్న అంచనాతో 800 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 200 కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు. తేమశాతం, నాణ్యత లేవన్న కారణంతో... కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వాతావరణం దృష్ట్యా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాయలేక ప్రైవేటులో తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నామని రైతులు చెబుతున్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, షామియానాలు, టార్పాలిన్లు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల అన్నదాతలే తూకం యంత్రాలను అద్దెకు తీసుకువస్తున్నారు. బస్తాలు నింపి సొంత వాహనాల్లో.... కొనుగోలు కేంద్ర నిర్వాహకులు చెప్పిన మిల్లుకు తరలిస్తున్నారు. లారీలు సకాలంలో రాక, హమాలీలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.

మారిన వాతావరణ పరిస్థితుల వల్ల ఉదయం ఎండ... సాయంత్రానికి ఈదురు గాలులతో కూడిన వర్షాలు రైతుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. చేతికొచ్చిన పంటను వదులుకోలేక ప్రైవేటు వ్యాపారులు, దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పాడిందని సాగుదారులు వాపోతున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరికొద్ది రోజుల్లో కోతలు ఊపందుకోనున్నాయి. ఒకేసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోటెత్తే అవకాశం ఉన్నందున తక్షణం మరిన్ని కొనుగోలు కేంద్రాలు తెరవాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. తరుగు పేరిట మిల్లర్ల దోపిడికి అడ్డుకట్ట వేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details