మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల గ్రామ విద్యార్ధిని లావణ్య పరిగిలో బాలికల వసతి గృహంలో ఉంటూ అక్కడి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. నెలరోజుల క్రితం పుస్తకాలు కూడా తెచ్చుకుంది. కానీ మంగళవారం ప్రారంభమైన డిజిటల్ తరగతులకు ఆమె దూరమైంది. టీవీ లేదు, స్మార్ట్ ఫోన్ లేదు, దగ్గర్లో తొమ్మిదో తరగతి చదివే విద్యార్ధులూ లేరు. టీవీ, ఫోన్ కొనె స్థోమత ఆ కుటుంబానికి లేదు. దీంతో పాఠాలకు ఆమె దూరమైంది. పగిడ్యాల గ్రామంలోనే పదో తరగతి చదువుతున్న కృష్ణది సైతం అదే పరిస్థితి.
అదే ఊళ్లోని మరో విద్యార్ధి టీవీలో పాఠాలు వింటున్నా చదువులో వెనకబడిన విద్యార్థి కావడంతో చెప్పే పాఠాలు అర్థం కావడం లేదు. ఇక పగిడ్యాలలో టీవీలున్న వాళ్లకు కేబుల్ కనెక్షన్లు లేవు. ఇంటర్‌నెట్ సిగ్నల్, విద్యుత్ అంతరాయంతో మారుమూల గ్రామాల్లోని విద్యార్ధులకు డిజిటల్ తరగతులు దూరమవుతున్నాయి.
వర్షాలు బాగా కురిసి వ్యవసాయం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్ని సైతం పొలం పనులకు తీసుకువెళ్తున్నారు. టీవీలు లేని వాళ్లు తోటి విద్యార్థుల ఇళ్లలోకి వెళ్లి పాఠాలు వినాలన్నది సర్కారు ఆలోచన. కరోనా ప్రభావం కారణంగా ఇతరులను ఇళ్లలోకి రానివ్వడానికి కొందరు అంగీకరించడం లేదు.