తెలంగాణ

telangana

ETV Bharat / state

గడువు తీరిన గుత్తేదారు పోలే.. ప్రభుత్వ ఆస్పత్రిలో పార్కింగ్​ పేరిట అక్రమ వసూళ్లు - Mahabubnagar Latest News

Mahabubnagar General Hospital Parking: మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో పార్కింగ్‌ ఫీజుల వసూళ్లు ఇష్టా రాజ్యంగా సాగుతున్నాయి. టెండర్‌ దక్కించుకున్న గుత్తేదారు.. ఏడాదిగా ఆస్పత్రికి చెల్లించాల్సిన రుసుం చెల్లించకపోగా.. గడువు ముగిసినా తప్పుకోవటం లేదు. సంవత్సర కాలంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నా.. జనరల్ ఆసుపత్రి వర్గాలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బకాయిలు రాబట్టకపోవడం, తిరిగి టెండర్లు పిలవక పోవడంతో ఆస్పత్రి ఆదాయానికి గండిపడుతోంది.

Mahabubnagar General Hospital
Mahabubnagar General Hospital

By

Published : Dec 1, 2022, 3:22 PM IST

మహబూబ్​నగర్​ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి వద్ద ఇష్టారాజ్యంగా పార్కింగ్‌ వసూళ్లు

Mahabubnagar General Hospital Parking: మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి నిత్యం 2వేల మంది బయటి రోగులు వచ్చి వెళ్తుంటారు. అలాగే రోగుల సహాయకులు.. వారిని పరామర్శించేందుకు వచ్చేవాళ్లు, ఇతర పనుల మీద వచ్చే వారు ఇలా.. వేలాది మంది జనరల్ ఆసుపత్రికి వస్తుంటారు. అలాంటి వాళ్లలో ద్విచక్రవాహనాలు, ఆటోలు, అద్దె వాహనాల్లో వచ్చే వాళ్లే అధికంగా ఉంటారు. వీళ్లంతా ఆసుపత్రిలో వాహనాల్ని నిలపాలంటే పార్కింగ్ రుసుం కింద ద్విచక్రవాహనాలకు 10, పెద్ద వాహనాలు 20రూపాయలు చెల్లించాలి.

ఇంతవరకూ బాగానే ఉన్నా.. పార్కింగ్ రుసుం వసూలు చేసేందుకు టెండర్ దక్కించుకున్న గుత్తేదారు గడువు ముగిసినా.. రుసుం వసూలు చేయడం, పట్టించుకోవాల్సిన అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడం జరుగుతోంది. రసీదులు బిల్లు పుస్తకం నుంచి ఇవ్వకుండా జిరాక్స్ తీయించినవి ఇస్తున్నారు. డబ్బులివ్వపోతే బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆస్పత్రికి వచ్చేవారు వాపోతున్నారు.

ప్రస్తుతం డబ్బులు వసూలు చేస్తున్న గుత్తేదారు రెండేళ్ల కోసం టెండరు దక్కించుకున్నారు. ఆ గడువు 2019 నుంచి 2021 ఆగస్టు నాటికి ముగిసింది. ఏడాదికి లక్షా 25వేలు ఆసుపత్రికి చెల్లించాల్సి ఉండగా ఒక్క సంవత్సరానికి సంబంధించిన డబ్బులే చెల్లించారు. అయినా గత ఏడాది ఆగస్టు నుంచి నిబంధనలకు విరుద్ధంగా పైసా వసూల్‌ సాగిస్తూనే ఉన్నాడు.

అయినా జనరల్ ఆసుపత్రి అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. గడువు ముగిసేందుకు సమయం దగ్గర పడగానే మళ్లీ రెండేళ్లకు టెండర్లు పిలిచేందుకు ఆస్పత్రి వర్గాలు సన్నద్ధమవ్వాల్సి ఉన్నా.. ఏడాది దాటినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆస్పత్రికి రావాల్సిన ఆదాయంపై దృష్టి పెటాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details