డీఆర్‌డీఏ-ఐకేపీ ఆధ్వర్యంలో నడిచే స్వయం సహాయక సంఘాలు, పురపాలికల్లో మెప్మా ఆధ్వర్యంలో నడిచే ఎస్‌హెచ్‌జీల్లో ఉన్న సభ్యులు ప్రతి నెలా సక్రమంగా కిస్తులను చెల్లిస్తున్నారు. కరోనా కష్టకాలంలో మహిళా సంఘాల సభ్యులు క్రమం తప్పకుండా రుణాల కిస్తులు కడుతున్నారు.
ప్రతి నెల సమావేశాల్లో సమీక్షించుకుంటూ కట్టాల్సిన రుణాలను చెల్లిస్తుండటం విశేషం. అందుకోసం సంఘాల సభ్యులు పూర్తిగా సహకరిస్తున్నారు. కరోనా సమయంలో డీఆర్‌డీఏ - ఐకేపీ నుంచి బ్యాంకు లింకేజీ నుంచి ఇచ్చిన రుణాల్లో రూ.7.98 కోట్లు వసూలయ్యాయి. రుణాలు పొందిన వారిలో 6.77 శాతం మంది రుణాలను కట్టడం లేదు. మెప్మా ఆధ్వర్యంలో ఇచ్చిన రుణాల్లో ఇప్పటి వరకు రూ.1.62 కోట్లు కిస్తుల రూపంలో చెల్లించారు. రుణాలు తీసుకున్న వారిలో 2.26 శాతం మాత్రమే కిస్తులను సక్రమంగా చెల్లించడం లేదు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ రుణాలకు 32,279 సంఘాలు అర్హత సాధించాయి. అందులో 3,87,348 మంది మహిళా సభ్యులు ఉన్నారు. వారికి వచ్చే ఏడాది మార్చి నెల చివరి నాటికి రూ.799.13కోట్ల రుణాలను అందించాలి. అందులో ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్టు నెలల్లో 3,874 సంఘాలకు రూ.87.58 కోట్లు చెల్లించారు. అందులో 93.23 శాతం చొప్పున రుణాలు తీసుకున్న మహిళలు తిరిగి ప్రతి నెలా కిస్తుల రూపంలో డబ్బులను బ్యాంకులకు చెల్లిస్తున్నారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా పట్టణాల్లో పేద మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలను అందిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 1,679 ఎస్‌హెచ్‌జీ సంఘాలకు రూ. 59.06 కోట్లు ఇవ్వాలనే లక్ష్యాన్ని నిర్ధరించారు. అందులో ఇప్పటి వరకు 309 సంఘాలకు రూ.14.68 కోట్లు ఇచ్చారు.
ఇచ్చిన రుణాల్లో రూ.1.62 కోట్లు చెల్లించారు. అంటే తీసుకున్నవారు రుణాలు చెల్లించిన వారిలో 97.74 శాతం ఉన్నారు. ప్రతి నెల కిస్తులను క్రమం తప్పకుండా పట్టణ మహిళలు చెల్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్, మక్తల్, నారాయణపేట, వనపర్తి కొత్తకోట, ఆత్మకూరు, గద్వాల, అలంపూరు, అయిజ, రాజోలి, వడ్డేపల్లి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, తదితర వాటిలో దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారికి ఈ రుణాలను అందిస్తున్నారు. వారంతా తిరిగి చెల్లిస్తున్నారు.
నిరంతర పర్యవేక్షణ..