Mana Ooru-Manabadi Programme: ప్రభుత్వ పాఠశాలలను సకల వసతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్రప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం మనఊరు -మనబడి, మనబస్తీ-మనబడి. రాష్ట్రంలో 26,072 బడులకుగాను 9,123 పాఠశాలలను తొలిదశలో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. అందుకోసం రూ.3,497 కోట్లు కేటాయించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1,099 పాఠశాలలను తొలివిడతలో ఎంపిక చేయగా 999 చోట్లనే అంచనాలు పూర్తయ్యాయి. పరిపాలన, సాంకేతిక అనుమతులు పొంది, పాఠశాల యాజమాన్య కమిటీ తీర్మానాలు పొందిన 152 బడులకే 15శాతం నిధుల్ని రివాల్వింగ్ ఫండ్ కింద మంజూరు చేశారు. ఆ పాఠశాలల్లోనే పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట్ల అసలు పనులే మొదలుకాలేదు.
మరోసారి అంచనాలు: చాలాచోట్ల ప్రక్రియ అంచనాల వద్దే ఆగిపోయింది. అంచనాల రూపకల్పనలో తప్పులు దొర్లడంతో మరోసారి అంచనాలు రూపొందించాల్సి వచ్చింది. శిథిలావస్థకు చేరిన గదులకు బదులుగా కొత్తగదుల నిర్మాణాలకు అంచనాలు రూపొందించమని ఆదేశించగా.. కొందరు అదనపు తరగతుల నిర్మాణాలను అంచనాల్లో చేర్చగా వాటిని సవరించాల్సి వచ్చింది. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా డైనింగ్ హాల్ నిర్మాణాలకు తొలుత అంచనాలు రూపొందించారు. తర్వాత ఒక్కో పాఠశాలకు 14 లక్షలతో ఒకే డైనింగ్ షెడ్‌కు అంచనాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో మరోసారి అంచనాలు రూపొందించాల్సి వచ్చింది. పంపినవి సరైనవా కావా తేల్చేందుకు మండల విద్యాశాఖ అధికారి, ప్రత్యేక అధికారి, ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పడంతో ప్రక్రియ ఆలస్యమైంది. పరిపాలన, సాంకేతిక అనుమతులు, ఎఫ్‌టీవో జారీ పక్రియ మందకొడిగా సాగుతుండటంతో చాలా చోట్ల పనులు మొదలుకాలేదు.