తెలంగాణ

telangana

ETV Bharat / state

అంత్యక్రియలకు గ్రామాలు ససేమిరా

ఒక మనిషి బతుకు అతని చావులో తెలుస్తుందనేది నానుడి. ఆ వ్యక్తి అంత్యక్రియలకు ఎక్కువమంది హాజరై, ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తే మహానుభావుడు.. భలే పేరు తెచ్చుకున్నాడని అంటారు. ఈ రోజుల్లో కరోనా మహమ్మారి బెడదతో ఆ పరిస్థితులన్నీ పూర్తిగా తలకిందులు అయిపోయాయి.

corona effect on cremations in rural areas
corona effect on cremations in rural areas

By

Published : May 5, 2020, 1:52 PM IST

కరోనా పేరు వింటేనే గ్రామీణులు ఉలిక్కిపడుతున్నారు. ఈ కారణంగానే గ్రామాల్లో లాక్‌డౌను వందశాతం అమలవుతోంది. సొంత గ్రామానికి చెందినవారైనా సరే.. ఇతర ప్రాంతాల నుంచి వస్తే గ్రామంలోకి రానివ్వడానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. హోం క్వారంటైనులో లేదా.. ఆసుపత్రి ఏర్పాటుచేసిన క్వారంటైనులో ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు.

చివరకు గ్రామంలో ఎవరైనా అనారోగ్యంతో చనిపోయినా సరే.. కరోనా ఉండొచ్చన్న అనుమానాలను రేకెత్తిస్తున్నారు. దీంతో ఆ అభాగ్యుల అంత్యక్రియలు అనాథ శవాలకు నిర్వహించిన మాదిరిగా పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు జరుపుతున్నారు. గత నెల.. నెలన్నర రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో సాధారణ మరణాలకు... ‘కరోనా’ అంత్యక్రియలు లెక్కకు మించి జరిగాయి.

  • కల్వకుర్తి మండలం రామగిరి గ్రామానికి చెందిన చంద్రయ్య (55) ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందగా.. ఆసుపత్రి నుంచి శవాన్ని గ్రామంలోకి అనుమతించలేదు. చివరకు పోలీసులు కల్పించుకొని సోమవారం అంతక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.
  • నాలుగు రోజుల కిందట చారగొండ మండలం దొండ్లపల్లికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన కూతుళ్లు ఊపాధి కోసం మిర్చీ తెంపే పనులకు ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా వెళ్లారు. తండ్రి అంత్యక్రియలకు కూతుళ్లను అడ్డుకునేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. ఇక్కడా అధికారులు, పోలీసులు కల్పించుకొని అంతా సజావుగా సాగేలా చూశారు. అంతకు మునుపు తెలకపల్లి మండలం గౌతంపల్లికి మహిళ ఆస్తమాతో మృతిచెందగా.. ఆమె అంత్యక్రియలకు గ్రామస్థులు ససేమిరా అనడంతో నాగర్‌కర్నూల్‌ పురపాలక సిబ్బంది చేయాల్సి వచ్చింది.
  • మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం ఇప్పటూరుకు చెందిన వ్యక్తి ఏప్రిల్‌ నెలలో ఊపిరితిత్తుల సమస్యతో మృత్యువాత పడ్డారు. కరోనా సోకి ఉండవచ్చని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేయడం వల్ల అర్ధరాత్రి వేళ పోలీసులు, అధికారులు దహన సంస్కారాలు చేశారు. ఇదే మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన ఓ మహిళ విషయంలోనూ ఇలాగే జరిగింది.
  • నారాయణపేట జిల్లా దామరగిద్దలో ఓ మహిళ క్షయవ్యాధితో మృతిచెందింది. బంధువులు ఎవరూ రాకపోవడంతో కుటుంబసభ్యులే అంత్యక్రియలు నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో గత నెలాఖరులో ముగ్గురు వ్యక్తులు వివిధ అనారోగ్య కారణాలతో ఒకేరోజు మృతి చెందారు. వీరి అంత్యక్రియలు కూడా జనం లేకుండా కరోనా నిబంధనల నడుమ జరిగాయి.

ఆందోళన వద్దు.... సహకరించండి :

అనారోగ్య కారణాలతో మృతిచెందిన వారికి కనీసం కుటుంబసభ్యుల మధ్యలో అంత్యక్రియలు నిర్వహించే విధంగా స్థానికులు సహకరించాలని పోలీసులు, రెవెన్యూ ఉన్నతాధికారులు కోరుతున్నారు. కరోనా వైరస్‌తో చనిపోతే ప్రభుత్వమే ప్రత్యేకంగా అంత్యక్రియలు నిర్వహిస్తోంది. అనారోగ్యంతో చనిపోయినా కరోనా అనుమానం పేరుతో శవాలను అడ్డుకోవడం సరికాదని కల్వకుర్తి ఆర్డీవో రాజేశ్​ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details