ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపే రవాణా వ్యవస్థ కుదేలవడంతో రైతులు సకాలంలో పంటను అమ్ముకోలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో యాసంగిలో 5లక్షల 70వేల ఎకరాల్లో వరిసాగైంది. 13లక్షల 50వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో తొమ్మిదిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 757 కొనుగోలు కేంద్రాల ద్వారా... 2లక్షల 64వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. కానీ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపేందుకు ఏర్పాటు చేసుకున్న లారీలు రాకపోవడంతో... కేంద్రాలు, కల్లాల వద్దే ధాన్యం కుప్పులుగా పేరుకుపోయింది. లారీలు రావడానికి రోజుల తరబడి సమయం పడుతుండటంతో... రైతులే ట్రాక్టర్లతో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లర్లు సకాలంలో ధాన్యాన్ని దింపుకోకపోవడంతో.. అక్కడే ట్రాక్టర్లతో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
రైతుల ఆందోళన
శుక్రవారం దేవరకద్ర మండలం పెద్దగోప్లాపూర్ రైస్ మిల్లు వద్ద 100కు పైగా ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరాయి. రైతులు మిల్లువద్దకొచ్చి వారం గడుస్తున్నా ట్రాక్టర్లలోని ధాన్యాన్ని దింపుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. లారీలు రాకపోతే తామే మిల్లులకు ధాన్యం తీసుకు వస్తున్నామని, మిల్లర్లు మాత్రం దింపుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు లాక్ డౌన్, మరోవైపు ఎండ తీవ్రతతో మంచినీళ్లు, ఆహారం కూడా దొరకడం లేదని వాపోయారు.
చేతులెత్తేస్తున్న మిల్లర్లు
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన లారీల ద్వారానే మిల్లులకు చేర్చాలి. అందుకోసం మహబూబ్‌నగర్‌లో 190, నాగర్‌కర్నూల్‌లో 170, గద్వాలలో 70, నారాయణపేటలో 150, వనపర్తిలో 230 లారీలను టెండర్ దక్కించుకున్న గుత్తేదారులు సమకూర్చాల్సి ఉంది. కాని సరిపడా లారీలను వారు పంపకపోవడంతో ధాన్యం రవాణా అస్తవ్యస్తంగా మారింది. తూకం, నాణ్యతలో తేడాల పేరిట మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని... సామర్థ్యానికి మించి ధాన్యం రావడంతో కొన్నిచోట్ల మిల్లర్లు చేతులెత్తేస్తున్నారు.