Mahabubnagar - Visakha Express Train Started : మహబూబ్‌నగర్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్లే రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటి వరకు పాలమూరు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు నేరుగా వెళ్లేందుకు ఎలాంటి రైలు సౌకర్యం లేదు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ రైలు వల్ల మహబూబ్‌నగర్ నుంచి నేరుగా కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాజమండ్రి, విశాఖపట్నం వరకు ప్రయాణించే అవకాశం లభించింది.
ఆ ఎక్స్‌ప్రెస్‌ను షాద్‌నగర్‌లో నిలిపే అంశాన్ని పరిశీలిస్తాం : ఇప్పటికే మహబూబ్‌నగర్-హైదరాబాద్ డబ్లింగ్ పనులు రూ.1400 కోట్లతో పూర్తి చేసి మోదీ జాతికి అంకితం చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలును సైతం మహబూబ్‌నగర్‌లో ఆపే విషయాన్ని రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని.. త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు. చెంగల్పట్టు-కాచిగూడ చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను షాద్‌నగర్‌లో నిలిపే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. తెలంగాణలో వెయ్యి కిలోమీటర్ల జాతీయ రహదారుల్ని విస్తరించాల్సి ఉందన్న కిషన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి ఇస్తే పనులు వేగవంతం చేస్తామన్నారు. మహబూబ్‌నగర్‌కు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.