తెరాస పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, పురఎన్నికల్లో అధికార పార్టీని ఓడించడంతో తెరాస పాలన అంతానికి నాంది పలకాలని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ అన్నారు. జడ్చర్ల పుర ఎన్నికల సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య సహా అన్ని వాగ్దాలను కేసీఆర్ తుంగలో తొక్కారని ఆరోపించారు.
హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ నంబర్ వన్ అన్నారు. కరోనా విళయ తాండవం చేస్తున్న వేళ పాఠశాలలు తెరచుకోవడం లేదు, కానీ మద్యం దుకాణాలు మాత్రం నడుస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యాన్ని కేసీఆర్ సర్కారు గాలికి వదిలేసిందని బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి ఆరోపించారు.