తెలంగాణ

telangana

ETV Bharat / state

గురుకులాల్లో అరాచకాలు.. తల్లిదండ్రులకు గర్భశోకం - telangana gurukul schools

రాష్ట్రంలోని గురుకులాల్లో అసలేం జరుగుతోంది? అనారోగ్యంతో గురుకుల విద్యార్థుల మరణాలు... బాలికలపై అత్యాచారాలు, గర్భవతులను చేస్తూ సిబ్బంది నిర్వాకాలు.. నీళ్లు లేవని అడిగితే ఓ గురుకులంలో 120 మంది బాలికల జుట్టు కత్తిరించిన ఘటన.. ఇలా గురుకులాల్లో జరుగుతున్న అనేక సంఘటనలు కలవరపెడుతున్నాయి. పిల్లలకి విద్యా బుద్ధులు చెప్పి తీర్చిదిద్దాల్సిన పాఠశాలల సిబ్బంది అరాచకాలు, నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాలు బలిగొంటున్నాయి. పరువును బజారుకీడుస్తున్నాయి. తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుస్తున్నాయి. ఇంకెన్నాళ్లు? గురుకులాల్లో అకృత్యాలు నిలువరించటం సర్కారు తరం కాదా?

గురుకులాల్లో అరాచకాలు.. తల్లిదండ్రులకు గర్భశోకం

By

Published : Nov 1, 2019, 2:27 PM IST

తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గురుకులాలకు నిర్వహణ తీరుపై నీలినీడలు అలుముకున్నాయి. రోజుకో సంఘటనతో నిత్యం గురుకులాలు వార్తల్లో నిలుస్తూ.. సిబ్బంది పనితీరుకు, అరాచక శైలికి అద్దం పడుతున్నాయి. డెంగీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని చనిపోయే దాకా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా వేధించారు ఓ గురుకులంలో సిబ్బంది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని కనీసం తల్లిదండ్రులకు సమాచారమివ్వకుండా.. చచ్చేదాకా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం వహించారు మరో గురుకులంలో సిబ్బంది.

ఇక బాలికలను అత్యాచారం చేస్తున్న ఘటనలు, గర్భవతులను చేస్తున్న సంఘటనలు ఏదో ఒక గురుకులం నుంచి నిత్యకృత్యమయ్యాయి. చివరికి తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుస్తున్నాయి. అసలు గురుకులాలు అంటేనే జనానికి భయం పుట్టేలా చేస్తున్నాయి ఇలాంటి ఘటనలు. ఇటు పిల్లల్ని ప్రైవేటు కాన్వెంట్లలో చదివించుకోలేక, అటు గురుకులాలకు పంపించాలని నిర్ణయించుకోలేక పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనతో నరక యాతన అనుభవిస్తున్నారు.

గురుకులాల్లో జరిగిన కొన్ని ఘటనలు

  • మెదక్​లో గురుకులం సిబ్బంది నిర్లక్ష్యంతో డెంగీ సోకి పదో తరగతి విద్యార్థిని కావ్య మృతి
  • మహబూబాబాద్​ జిల్లా గూడూరు కేజీబీవీలో పదో తరగతి బాలికను గర్భవతిని చేసిన ఏఎన్​ఎం భర్త
  • మహబూబ్‌నగర్‌ జిల్లా చిట్టెబోయినపల్లి గురుకుల పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థిని మృతి
  • మెదక్​ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ మినీ గురుకుల పాఠశాలలో 120 మందికి జుట్టు కత్తిరించిన ఆయా

చర్యలేవి?
ఇలాంటి సంఘటనలు ఇన్ని వెలుగులోకి వస్తున్నా... గురుకుల పాఠశాలల సిబ్బంది ప్రవర్తనలో మార్పు రావడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గురుకులాల్లో పటిష్ఠమైన నిఘా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. గురుకులాల్లో సిబ్బంది పనితీరుపై తగు విధివిధానాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. అసలు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సి ఉందని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గురుకులాల పనితీరు, సిబ్బంది వ్యవహార శైలిలో సమూల మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు అత్యున్నత స్థాయిలో చర్చించి ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

గురుకులాల్లో అరాచకాలు.. తల్లిదండ్రులకు గర్భశోకం

ఇదీ చూడండి : 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'

ABOUT THE AUTHOR

...view details