Agitation of Udandapur residents: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లమండలం ఉదండపూర్ జలాశయంలో నిర్వాసితుడవుతున్న యాదయ్య తనకు చెల్లించాల్సిన ఇంటిపరిహారంలో అన్యాయం జరిగిందని ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 10లక్షలు వెచ్చించి నిర్మించుకున్న ఇంటికి... కేవలం 4లక్షల 20వేలే లెక్కించారని, జరిగిన అన్యాయంపై పోరాడినా ఫలితం లేకపోవడంతో... ఆవేదనకు గురై జలాశయం కోసం తవ్విన నీటి గుంతలోపడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొందరికి ఒకలా, ఇంకొందరికి మరోలా పరిహారం లెక్కించారని... అందరికి సమన్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
యాదయ్య ఒక్కరే కాదు ఉదండపూర్ గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న చాలామందికి సరైన పరిహారాన్ని జాబితాలో పొందుపర్చలేదని... గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఉదండపూర్ నిర్వాసితుల ఇళ్ల పరిహారానికి సంబంధించిన జాబితా బయటకొచ్చింది. అందులో ఇళ్లేలేని మొండిగోడలు, రేకుల ఇళ్లు, పూరీ గుడిసెలకు లక్షల్లో పరిహారం చెల్లించాలని... పిల్లర్లు, స్లాబ్‌లు వేసి పక్కాగా నిర్మించుకున్న ఇళ్లకు తక్కువ పరిహారం వచ్చేలా జాబితా రూపొందించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒకే కొలతలతో, నిర్మాణాలతో కూడిన ఇళ్లకు ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువగా పరిహారం ఇచ్చారని ఇదెక్కడి న్యాయమని నిలదీస్తున్నారు.