దాదాపు రెండు నెలల కిందట ఓ లారీ.. ఆటోలోని 13 మందిని కబళించిన దుర్ఘటన తాలూకు విషాదమిది. ఒక్క ప్రమాదం.. రెండు ఊళ్లలో.. దాదాపు పది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
వ్యవస్థలోని లోపాలు ఆ కుటుంబాలకు శాపమయ్యాయి. రోజూ కూలికి వెళ్తే కానీ కడుపు నిండని బతుకులను రోడ్డుపాలు చేశాయి. ఓ ఆటో డ్రైవరు అత్యాశ.. నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోని ప్రభుత్వ శాఖలు.. తగినంతగా రవాణా సదుపాయాలు లేకపోవడం, రోడ్డు ప్రమాదాలను అరికట్టాల్సిన విభాగం నిర్లక్ష్యం.. ఇవన్నీ కలిసి రెండు గ్రామాల్లోని ఒక తరాన్ని అనాథగా మార్చేశాయి. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రెడ్డిగూడ కమాన్ మలుపు వద్ద గత ఆగస్టులో ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదం తాలూకు గాయాలు కొత్తపల్లి, గోగ్యాతండా వాసుల గుండెలను పిండేస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 12 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆస్పత్రిలో మృత్యువాతపడ్డారు. వారి పిల్లలు అనాథలయ్యారు.. వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరమైంది.
జవాబు చెప్పేది ఎవరు?
కేవలం నలుగురు లేదా ఐదుగురు పట్టే ఆటో అది. అందులో ఏకంగా 18 మంది ఎక్కారు. ప్రజారవాణా వ్యవస్థ మెరుగ్గా ఉంటే వారిలాంటి సాహసానికి ఒడిగట్టేవారా? పరిమితికి మించి జనం ఆటోల్లో ప్రయాణిస్తున్నా గుర్తించని రవాణాశాఖ.. చలానాలకే పరిమితమైన పోలీసులు.. వీరంతా బాధ్యులు కారా? ఇక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో నిత్యం ఎంతోమంది ఇలాగే ప్రయాణిస్తుంటారు. వారందరికీ ప్రాణాల మీద తీపి లేక కాదు.. కూలీ పనులలో.. ఇతర విధులకో సకాలంలో, తక్కువ ఖర్చుతో వెళ్లాలనే ఉద్దేశంతో తప్పనిసరై ఇలా రాకపోకలు సాగిస్తూ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.