పది రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కొవిడ్ మహమ్మారి కబళించిన విషాద ఘటన ఇది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన భిక్షం(60)కు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు వీరన్న(40) నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెరికల్చర్ ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ మహబూబాబాద్ పట్టణంలో ఉంటున్నారు. రెండో కుమారుడు రామచంద్రు హైదరాబాద్‌లో, మూడో కుమారుడు ఉపేందర్(32) హన్మకొండలో నివాసముంటున్నారు.
భిక్షం దంపతులకు ఇటీవల ఆరోగ్యం సహకరించకపోవడంతో వీరన్న వద్ద కొన్ని రోజులు ఉందామని వెళ్లారు. అక్కడికి వెళ్లిన కొద్ది రోజులకే వీరన్న కొవిడ్ బారిన పడటంతో గూడూరులోని క్వారంటైన్ కేంద్రంలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే భిక్షంకు సైతం వైరస్ సోకి అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. వీరన్నను కూడా అక్కడికే తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల రెండో తేదీన భిక్షం, 4న వీరన్న మృతి చెందారు.