ఎస్సారెస్పీ కాలువ దాటేందుకు రక్షణగా ఏర్పాటు చేసిన తాడు తెగి.. కాలువలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరి ప్రాణాలను ముగ్గురు రియల్ హీరోస్ కాపాడిన సంఘటన... మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం దుబ్బ తండాలో చోటు చేసుకుంది.
తాడు తెగిపోవడంతో కొట్టుకోపోయిన చిన్నారులు..
తండా పక్కనే ఉన్న ఎస్సారెస్పీ కాలువ దాటడానికి రక్షణగా ఏర్పాటు చేసిన తాడును పట్టుకొని వసంతి, రమ్మశ్రీ, హిందు, వైష్ణవిలు... నలుగురు కలిసి ఈత కొడుతున్నారు. అకస్మాత్తుగా తాడు తెగిపోవడంతో.. నలుగురు చిన్నారులు కాలువలో కొట్టుక పోవడాన్ని ఒడ్డు పక్కనే ఉన్న ఓ యువతి గమనించి... కేకలు వేసింది. సమీపంలో మిర్చి కళ్లంలో తాలు కాయలు వేరు చేస్తున్న భరత్, లోకేశ్, చరణ్ తేజ్‌లు విని వెంటనే కాలువ వద్దకు చేరుకున్నారు. భరత్, లోకేష్ కాలువలోకి దిగి... హిందు, వైష్ణవిలను పట్టుకొని ఒడ్డున ఉన్న చరణ్ తేజ్‌లకు అందించి ఇద్దరి ప్రాణాలను నిలబెట్టారు. మిగిలిన ఇద్దరిని కాపాడే లోపే నీటిలో మునిగిపోయారు. ఇంత చేసిన వీరిద్దరు గజ ఈత గాళ్లో, అనుభవం కలిగిన పెద్ద వారో కాదు... భరత్ నాలుగో తరగతి, లోకేశ్ రెండో తరగతి చదువుతున్నారు.
చిన్నారులకు అభినందనలు
పెద్ద వారు కూడా అంత తొందరగా స్పందించి కాపాడేవారు కాకపోవచ్చు. సాధారణంగా నీటిలో మునిగిపోతున్న వారిని కాపాడే ప్రయత్నంలో మునిగి పోతున్న వ్యక్తులు భయంతో కాపాడే వ్యక్తిని గట్టిగా పట్టుకోవడంతో.. వారు కూడా చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చిన్నారులు లోకేశ్, భరత్, చరణ్ తేజ్‌లు ఏమాత్రం ఆలోచించకుండా, భయం లేకుండా కాలువలోకి దిగి ఇద్దరు ప్రాణాలను కాపాడారు. చిన్నారుల ధైర్యాన్ని ప్రతి ఒక్కరు అభినందించారు. తండా వాసులు కాలువలో గాలించి మిగిలిన ఇద్దరిని బయటికి తీశారు. రమ్మశ్రీ అప్పటికే మృతి చెందిందగా, అపస్మారక స్థితిలో ఉన్న వసంతిని... స్థానిక పీహెచ్‌సీకి తరలించి పరీక్షించగా అప్పటికే మృతి చెందింది.
తీవ్ర విషాదంలో తండావాసులు
అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కనిపించిన బిడ్డలు విగత జీవులుగా మారడంతో ఆ చిన్నారుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శంకర్ నాయక్, అదనపు కలెక్టరు కొమరయ్య పరామర్శించారు. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల మరణంతో... ఆ తండాలో విషాధచాయలు అలముకున్నాయి.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం దుబ్బ తండాలో విషాదం ఇదీ చూడండి: