తెలంగాణ

telangana

By

Published : Apr 17, 2023, 10:50 PM IST

ETV Bharat / state

Corona positive: వసతి గృహంలో కరోనా కలకలం.. 20 మందికి పాజిటివ్​

Carona cases in Mahabubabad: రాష్ట్రంలో కరోనా మళ్లీ పంజా విప్పుతుంది. ఏడాది కాలంగా కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని ప్రజలు ఆనందపడుతున్న సమయంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మళ్లీ మాస్క్​లు ధరించే రోజులు వస్తాయమోనని ఆందోళన చెందుతున్నారు. తాజాగా మహబూబాబాద్​ జిల్లాలో ఓ పాఠశాలలో 20 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణైంది. మరో జిల్లాలో ఒక కుటుంబానికి కరోనా పాజిటివ్​ వచ్చింది.

carona
carona

Carona cases in Mahabubabad: అందరూ ఇప్పుడిప్పుడే మరచిపోతున్న కరోనా మహమ్మారి మళ్లీ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమై వారికి తగిన జాగ్రత్తలు చెబుతున్నారు. తాజాగా మహబూబాబాద్​, నిర్మల్​ జిల్లాల్లో కరోనా కలకలం రేగింది. ఈ రెండు జిల్లాల్లో మళ్లీ కరోనా కేసులు రావడంతో స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు.

రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం..మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని బంజారా సేవా సమితి వసతి గృహ పాఠశాలలో 20 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నమోదైంది. వారిని ఇదే పాఠశాలలోని పై అంతస్తులో క్వారంటైన్​లో ఉంచి వైద్య సేవలను అందిస్తున్నారు. వారిలో 16 మంది విద్యార్థులు కాగా.. నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ఈ పాఠశాలలో మొత్తం 73 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

పరిశీలనలో మరో 50 మంది: ఆదివారం విద్యార్థులు మోడల్ స్కూల్​లో ప్రవేశాలకు గానూ.. ప్రవేశ పరీక్షలు రాసేందుకు మరిపెడ, ఖమ్మం, చిల్కోడు, అనంతారం తదితర ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాసి తిరిగి పాఠశాలకు చేరుకున్నారు. సాయంత్రం నుంచి విద్యార్థులు దగ్గు, పడిశం బారిన పడటంతో ముల్కనూరు ప్రాథమిక, గార్ల సామాజిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పాఠశాలకు చేరుకొని వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్​గా తేలింది. గ్రామ పంచాయతీ సిబ్బంది పాఠశాల పరిసరాల్లో బ్లీచింగ్ చేశారు. తహశీల్దార్ రాము, సర్పంచి బన్సీలాల్​లు పాఠశాలను సందర్శించారు. ఇదే వసతి గృహంలో ఉన్న మరో 50 మందిని పరిశీలనలో ఉంచామని, కొవిడ్ బారిన పడిన వారికి కిట్లను అందజేసినట్లు ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అవినాశ్ తెలిపారు.

ఆర్జీయూకేటీ ఉపాధ్యాయుడికి కరోనా: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో కరోనా కలకలం రేపింది. ఆర్జీయూకేటీలో పని చేస్తున్న ఓ అధ్యాపకుడికి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఇద్దరు బాసర పీహెచ్​సీలో సోమవారం పరీక్షలు చేసుకున్నారు. అయితే వారికి కరోనా వచ్చినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. వారందరూ బాగున్నారని.. వారికి కరోనా కిట్ అందజేసి పంపించినట్లు తెలిపారు.

వైద్యుల సూచనలు:రాష్ట్రంలో కరోనా కేసులు రావడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. మళ్లీ మాస్కులు ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ విషయంలో ఎలాంటి అశ్రద్ధ వహించ వద్దని తగిన జాగ్రత్తలు తీసుకొంటే ఆదిలోనే మట్టుపెట్టవచ్చని సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details