తాగొచ్చి డ్రైవింగ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ - dipo
ఆర్టీసీ బస్సు డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడుపుతున్నాడని ఆరోపిస్తూ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదంటూ డ్రైవర్ను నిలదీశారు.
సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వయా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మీదుగా వేములవాడకు వెళ్తుంది. 47 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. అంతా బానే ఉండగా... గున్నేపల్లి స్టేజ్ సమీపంలో రహదారి పై జరుగుతున్న గొడవ వద్దకు బస్సు డ్రైవర్ బస్సు దిగి వెళ్ళాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండి ఊగుతూ నడుస్తున్నట్లుగా స్థానికులు గుర్తించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వారంతా బస్సు నుంచి దిగి మద్యం సేవించి బస్సు నడపడమేంటని అతనిని నిలదీశారు. ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ మండిపడ్డారు. అనంతరం బస్సు కండక్టర్ వేరే ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను ఎక్కించి అక్కడ నుంచి వారిని పంపించారు.