మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మీట్యా తండా శివారులో రైతులకు, గ్రానైట్ క్వారీ యజమానులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గాయత్రి క్వారీ తవ్వకాలు చేస్తున్న ప్రదేశానికి సమీపంలో ఉన్న భూముల్లో మర్రి కుంట తండాకు చెందిన కొందరు రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేసుకుంటున్న భూములు తమకు చెందినవని గాయత్రి క్వారీ యజమానులు సంబంధిత పత్రాలు చూపించి జేసీబీలతో కందకాలు తవ్వడం ప్రారంభించారు.
రైతులకు గ్రానైట్ క్వారీ యజమానులకు మధ్య ఘర్షణ
భూమి మాదంటే మాదని రైతులు, గ్రానైట్ క్వారీ యజమానులకు మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మీట్యా తండా శివారులో చోటుచేసుకుంది. క్వారీ సిబ్బంది జేసీబీతో కందకాలు తీస్తుండగా... రైతులు అడ్డుపడటం వల్ల ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
Friction between Quarry owners and farmers
ఆ భూములు తమవేనని... కందకాలు ఎలా తీస్తారని గిరిజన రైతులు జేసీబీలకు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో క్వారీ యజమానులకు రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెండు వర్గాలను సముదాయించగా పరిస్థితి సద్దుమణిగింది. ఈ విషయంపై తహసీల్దార్ రమేశ్‌ను ఫోన్లో వివరణ కోరగా... సదరు భూములు కొంత మంది ప్రైవేటు వ్యక్తులకు చెందినవని.. అందుకే తాము అక్కడికి వెళ్లలేదని తెలిపారు.