Bus wheel blown out: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వస్రాంతండా వద్ద ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు బస్సు ముందు చక్రం అకస్మాత్తుగా ఊడిపోయింది. వేగంతో ఉన్న బస్సు కొంత దూరం దూసుకెళ్లి రహదారిపై నిలిచిపోయింది. ఊడిన చక్రం సుమారు 40 మీటర్ల దూరంలోని ముళ్లపొదల్లో పడిపోయింది. బస్సులో 70 మంది దాకా ఒడిశాకు చెందిన కూలీలు ఉన్నారు. వీరంతా కరీంనగర్‌కు వెళుతున్నారు. ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వేగంతో వెళుతుండగా
వరంగల్- ఖమ్మం 563 వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడిశాలోని మరకుర్ పట్టణానికి చెందిన 70 మంది కూలీలతో.. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు అక్కడి నుంచి కరీంనగర్‌కు బయలుదేరి వెళుతోంది. బస్సు వేగంతో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో వస్రాంతండా వద్దకు చేరుకోగానే.. బస్సు ముందు భాగంలోని ఎడమవైపు చక్రం అకస్మాత్తుగా ఊడిపోయింది. వేగం మీదున్న బస్సు ఒక్కసారిగా తీవ్ర కుదుపునకు గురై కొంత దూరం దూసుకెళ్లింది.
డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని కూలీలు తెలిపారు. అనంతరం కూలీలు వేరే వాహనాల్లో బయలుదేరి వెళ్లిపోయారు. బస్సు అదుపుతప్పి బోల్తా పడి ఉన్నట్లయితే భారీ ప్రాణనష్టం వాటిల్లేదని స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఇదీ చదవండి:New Year Restrictions in Hyderabad: 'ప్రజలకు విజ్ఞప్తి.. రేపు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండండి'