తెలంగాణ

telangana

ETV Bharat / state

అవసరమే ఆవిష్కరణకు నాంది.. గొర్రు యంత్రాన్ని కనిపెట్టిన యువకుడు! - వినూత్నంగా ఆలోచించిన యువకుడు

కొత్తగా ఆలోచిస్తే.. అద్భుతమైన ఆవిష్కరణలకు చిరునామా​గా మారొచ్చని ఆలోచించాడు ఓ యువకుడు. వ్యవసాయం చేస్తూ అహర్నిశలు కష్టపడుతున్న తండ్రికి తనవంతు సాయం చేయాలనుకున్నాడు. వినూత్నంగా ఆలోచించి పాత బైక్​ ఇంజిన్​తో గొర్రు యంత్రం తయారుచేశాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. మరిన్ని యంత్రాలు తయారు చేసి రైతులకు అందిస్తా అంటున్నాడు మహబూబాబాద్​ జిల్లాకు చెందిన సంతోష్​.

Bike Mechanic invents Gorru Mechine In Mahabubabad District
అవసరమే ఆవిష్కరణకు నాంది.. గొర్రు యంత్రాన్ని కనిపెట్టిన యువకుడు!

By

Published : Sep 12, 2020, 2:35 PM IST

అవసరాలే ఆవిష్కరణలకు దారి చూపుతాయనే మాట మరోసారి రుజువైంది. ఖాళీ సమయంలో బైక్​ మెకానిక్​గా పనిచేసే ఓ యువకుడు అహర్నిశలు కష్టపడుతున్న తన తండ్రికి అణువంతైనా ఆసరా కావాలనుకున్నాడు. తండ్రి చేసే పనినే మరింత సులువుగా ఎలా చేయొచ్చో ఆలోచించాడు. పదును పెడితే.. మట్టితో చేసిన ఆయుధం కూడా బ్రహ్మాస్త్రంగా మారుతుందంటారు. ఈ యువకుడి విషయంలో కూడా అదే జరిగింది. తక్కువ ఖర్చుతో పాత బైక్​తో గొర్రు యంత్రాన్ని తయారు చేసే ఆలోచన వచ్చింది. వెంటనే.. ఆలోచనను ఆచరణలో పెట్టాడు.

మహబూబాబాద్​ జిల్లా గార్ల మండలం ఇందిరా నగర్​ తండాకు చెందిన గంగావత్​ సంతోష్​ ఇంటర్మీడియట్​ చదువుతున్నాడు. ఖాళీ సమయాల్లో ద్విచక్ర వాహనాల మెకానిక్​గా పని చేస్తాడు. తండ్రి భావ్​సింగ్​. సాదారణ రైతు. ఎద్దులు, ట్రాక్టర్​తో పొలాన్ని దున్నడం వ్యవసాయం చేయడం మాత్రమే తెలిసిన వాడు. ఓ రోజు తండ్రి గొర్రు కొడుతుండగా సంతోష్​ తదేకంగా చూశాడు. తండ్రి చేసే పనిని చిన్న యంత్రంతో.. సులభంగా.. తొందరగా అయిపోయేలా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. కత్తిలాంటి ఐడియా వచ్చింది. వెంటనే తాను పనిచేసే బైక్​ మెకానిక్​ దగ్గరికి వెళ్లి రూ.2500 లకు ఓ పాత టీవీఎస్​ బైక్​ కొనుగోలు చేశాడు. నాలుగైదు రోజులు అవిరామంగా శ్రమించి గొర్రు యంత్రం తయారు చేశాడు. ముందుగా తన పొలంలోనే.. ప్రయోగం చేశాడు. ఏముందీ.. ప్రయోగం విజయవంతమైంది. బైక్​ ఇంజిన్​తో తయారు చేసిన ఆ యంత్రంలో పెట్రోల్​ పోస్తే చాలు..రోజుకు రెండెకరాల్లో అలసిపోకుండా.. సులభంగా గొర్రు కొట్టవచ్చు. ప్రభుత్వం సహకరిస్తే.. ఈ యంత్రాన్ని మరింత అభివృద్ధి చేసి.. మరింత మంది రైతులకు అందుబాటులోకి వచ్చేలా చేస్తా అంటున్నాడు సంతోష్​. తాను పడుతున్న కష్టానికి తన వంతు సాయంగా గొర్రు యంత్రాన్ని రూపొందించిన కొడుకును చూసి.. బావ్​సింగ్​ మురిసిపోతున్నాడు. గొర్రు యంత్రం కావాలంటే.. తీసుకెళ్లండి. నా కొడుకే తయారు చేశాడు. పని తొందరగా అయిపోతుంది అంటూ.. మురిసిపోతూ.. చెప్తున్నాడు.

ఇదీ చూడండి: ఇసుక అక్రమ రావాణాకు చిరునామాగా ఆ జిల్లా

ABOUT THE AUTHOR

...view details