మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని బయ్యారం చెరువు జిల్లాలోనే అతి పెద్ద చెరువు. దీని సామర్థ్యం 0.4 టీఎంసీలు. 16.5 ఫీట్లకు నీరు చేరుకుంటే చాలు అలుగు పొంగేది. రాష్ట్రంలోనే మొట్టమొదటగా పొంగే చెరువు ఇదే కావడం గమనార్హం. చుట్టూ కొండలు... మధ్యలో జలకళతో ప్రకృతి రమణీయంగా కనిపించే ఈ చెరువు ప్రస్తుతం నీరు లేక మైదానంగా మారి పోయింది. ఈ పరిస్థితి చూసి వేలాది మంది ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
చెరువులో క్రికెట్ ఆడుకుంటున్న యువకులు
ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ చెరువు కింద సుమారు 15 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువు పక్కనే ఉన్నా వరుణుడు కరుణించక ఇప్పటి వరకు వరి నారు కూడా పోసుకోలేకపోయామని, కనీసం ప్రత్యామ్నాయ పంటలు వేసుకుందామన్నా భూమి దున్నే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ నిండుకుండలా ఉంటూ... తమ పంటలకు నీరందించే బయ్యారం చెరువు ప్రస్తుతం విద్యార్థులు క్రికెట్ ఆడుకునేందుకు మాత్రమే పనికొస్తుందని రైతులు వాపోతున్నారు.