తెలంగాణ

telangana

ETV Bharat / state

‘బీపాస్‌’పాసయ్యేనా?.. అధికారుల లేమితో ఇబ్బందులు! - కాగజ్​నగర్​లో టీఎస్​ బీపాస్​ సేవలు తాజా వార్త

రాష్ట్ర ప్రభుత్వం అన్ని పురపాలికల్లో భవన నిర్మాణాలు, లే-అవుట్లకు సత్వరమే అనుమతులిచ్చేందుకు వీలుగా టీఎస్‌-బీపాస్‌ విధానాన్ని తెచ్చింది. నేటి నుంచి ఈ విధానం అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే పారిశ్రామిక ప్రాంతమైన కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్‌నగర్‌ పురపాలికలో పట్టణ ప్రణాళిక విభాగంలోని అన్ని పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విధానం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలన, అమలుపై తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. కాగా ఆ ఖాళీ పోస్టులను భర్తీ చేస్తేనే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సత్వరమే భవనాల అనుమతులు అభించే అవకాశం ఉందని చెప్పవచ్చు.

ts b pass services difficulties in kumaram bheem district kagaznagar
‘బీపాస్‌’పాసయ్యేనా?.. అధికారుల లేమితో ఇబ్బందులు!

By

Published : Nov 11, 2020, 1:25 PM IST

భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యంతో స్థిరాస్తి రంగానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. పరోక్షంగా అవినీతికి కారణమవుతోంది. వీటికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో సర్కారు టీఎస్​ బీపాస్​ విధానానికి శ్రీకారం చుట్టింది.

సిబ్బందే లేని టీపీ విభాగం

పురపాలిక పరిధిలోని పట్టణ ప్రణాళిక (టీపీ-టౌన్‌ ప్లానింగ్‌) విభాగంలోని అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి కేవలం ఒకే ఒక్క టీపీఎస్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. ఆయన సైతం కేవలం వారానికి ఒక్కరోజు సోమవారం మాత్రమే వస్తుంటారు. మిగిలిన రోజుల్లో ఆ విభాగం గదిలో అధికారుల కుర్చీలన్నీ ఖాళీ. ఆ విభాగంలో టీపీఓ-1, టీపీఎస్‌-02, టీపీబీవో-04 పోస్టులుండాలి. ఏ ఒక్క పోస్టు భర్తీకి నోచుకోక అన్నీ ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి.

నిబంధనలివీ..

* ఈ విధానంలో 75 చ.గ. ఉండే ప్లాట్లలో భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. రూపాయి చెల్లించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే చాలు.

* 500 చ.మీ. విస్తీర్ణం వరకూ ఉండే స్థలంలో గరిష్ఠంగా పది మీటర్ల ఎత్తు వరకూ నిర్మించే భవనాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా వెంటనే నిర్మాణ అనుమతి లభిస్తుంది.

* భవన నిర్మాణాలతోపాటు, లే-అవుట్ల అనుమతులు వైబ్‌సైట్‌ ద్వారానే పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో లభిస్తాయి. స్వీయ ధ్రువీకరణ ఆధారంగానే ఆన్‌లైన్‌లోనే ఆక్యూపెన్సీ సర్టిఫికెట్‌ అందజేస్తారు.

* రెండున్నర ఎకరాల్లోపు ఉండే లేఅవుట్‌లకు జిల్లా పాలనాధికారి నేతృత్వంలోనే టీఎస్‌-బీపాస్‌ జిల్లా కమిటీ అనుమతి ఇస్తుంది.

* కాగజ్‌నగర్‌ పురపాలికలో అక్రమ లే-అవుట్ల, స్థలాల క్రమబద్ధీకరణకు 1935 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే గడువు ముగిసింది. ఆశించిన స్థాయి కంటే దరఖాస్తులు ఎక్కువ వచ్చాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, సత్వరమే అనుమతి పత్రాలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, పురపాలిక కమిషనర్‌ ఆధ్వర్యంలో జారీ చేయాలి.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా...

పట్టణ ప్రణాళిక విభాగంలోని అన్ని పోస్టుల ఖాళీలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా.. త్వరలోనే ఖాళీ పోస్టులు మంజూరయ్యే అవకాశం ఉందని కాగజ్​నగర్​ పురపాలిక కమిషనర్​ శ్రీనివాస్​ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఉమ్మడి జిల్లాలో ఊపందుకున్న ధరణి సేవలు.. అడ్డుగా ఏజెన్సీ చట్టాలు..

ABOUT THE AUTHOR

...view details