ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల ఓ యువతి, మరో యువకుడు పెద్దపులి పంజాకు బలవడం.. పశువుల్ని చంపడం లాంటి ఘటనల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 20 మంది అటవీ అధికారులు 16న మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు వెళ్లి అక్కడ టైగర్ మేనేజ్‌మెంట్‌పై అధ్యయనం చేశారు.
చంద్రాపూర్ జిల్లాలో రెండొందల పైచిలుకు పెద్దపులులు ఉన్నాయి. పులులకు ఆహారం, ఆవాసం సమస్య లేకుండా చూడటం.. వాటి ద్వారా ప్రజలకు ఆపద కలగకుండా చూసేందుకు.. మహారాష్ట్ర అటవీ శాఖ అవలంబిస్తున్న పద్ధతులపై ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారులు అధ్యయనం చేశారు. ఆ రాష్ట్ర పీసీసీఎఫ్, తడోబా టైగర్ రిజర్వు ఫీల్డ్‌డైరెక్టర్‌తో సమావేశమై పులుల సంరక్షణ, వాటి కదలికలు పసిగట్టడం వంటి విషయాలను తెలుసుకున్నారు. మహారాష్ట్రలో టైగర్ మేనేజ్‌మెంట్ అద్భుతంగా ఉందని అక్కడికి వెళ్లిన బృందంలోని ఓ అధికారి చెప్పారు.