తెలంగాణ

telangana

ETV Bharat / state

Mla Konappa: అది నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే కోనప్ప - forest officers attack on farmers

కుమురం భీం జిల్లా పరిషత్ సమావేశంలో అటవీ శాఖ అధికారులపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పోడు రైతుల సమస్య తీవ్రంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం వచ్చిందంటే.. అధికారులు, పోడు రైతులపై దాడులకు దిగుతారంటూ మండిపడ్డారు.

mla koneru konappa
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

By

Published : Jun 30, 2021, 9:31 PM IST

జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన యోధుడి పేరు పెట్టినా.. కుమురం భీం జిల్లాలో ఆదివాసీలపై అటవీ అధికారుల ఆగడాలు మాత్రం ఆగడం లేదని ఎమ్మెల్యే కోనప్ప (Mla Konappa) ఆవేదన వ్యక్తం చేశారు. పోడు రైతుల సమస్య తీవ్రంగా ఉందంటూ.. జిల్లా పరిషత్ సమావేశంలో అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఎకరంలో నైనా కొత్తగా పోడు వ్యవసాయం చేస్తున్నట్లు నిరూపిస్తే.. పదవికి రాజీనామా చేస్తానన్నారు. అవసరమైతే కలెక్టర్, జడ్పీ ఛైర్‌ పర్సన్, అధికారులందరికి చేతులెత్తి మొక్కుతానంటూ.. పోడు వ్యవసాయం చేసే రైతులను మాత్రం అడ్డుకోవద్దని సభాముఖంగా ప్రాధేయపడ్డారు.

రాజకీయం చేస్తున్నారు..

అధికారులు పులుల పేర్లు చెప్పి ప్రజలను భయపెడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులపై కక్ష గట్టి మారుమూల గ్రామాలకు రోడ్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీలు దాదాపు 50 ఏళ్ల నుంచి అదే ప్రాంతంలో జీవిస్తున్నారని ప్రస్తావించారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి అటవీ అధికారుల జులుం అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. విత్తనాలు పెట్టె సమయంలో వారిని అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.

నిరుపిస్తే రాజీనామా చేస్తా..

సీఎం ఏ సూచనలు ఇచ్చినా.. తూ.చ తప్పకుండా పాటించామని ఎమ్మెల్యే తెలిపారు. పాత పోడు భూములపై ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినా.. అధికారులు రైతులపై దాడులు ఆపడం లేదని ఆయన మండిపడ్డారు. వర్షాకాలం వచ్చిందంటే అధికారులు, పోడు రైతులపై దాడులకు దిగుతున్నారని అన్నారు. కలెక్టర్‌ ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెదిరింపులతో రైతులకు నిద్ర కూడా పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలో ఆదివాసీలు నిజాం ప్రభుత్వ కాలం నుంచి పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి గోస అంతా ఇంతా కాదు. ఇప్పటికే పలుమార్లు అటవీ అధికారులు రైతులపై చేయి చేసుకుంటూ దౌర్జన్యం చేస్తున్నారు. పొలాల్లోకి వెళ్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. వారికి ఆ అధికారాలు ఎవరిచ్చారు? పులుల పేర్లతో వారిని ఇబ్బందులు పెడుతున్నారు. గ్రామాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇలాంటి చర్యల వల్ల మేము గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు. రైతులను కొట్టే అధికారం మీకు ఎక్కడిది? మేము ఏం తప్పు చేశామో చెప్పండి. మీకు రెండు చేతులెత్తి మొక్కుతాం. రైతులను ఇబ్బంది పెట్టకండి.

- కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే

ఇదీ చదవండి:KTR: 'దేశంలో రెండో హరిత విప్లవానికి తెలంగాణ నాంది'

ABOUT THE AUTHOR

...view details