రాజకీయమంటేనే .. క్షణం తీరికలేకుండా సాగే ఓ వ్యాపకం లాంటిది. పైగా... ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత... నేతల దినచర్య మరింత బిజీగా మారిపోతోంది. కానీ దానికి భిన్నంగా కోనేరు కోనప్ప చేస్తున్న ప్రయత్నం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. కరోనా కంటే ముందు.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ కేంద్రంగా ప్రతిరోజు మధ్యాహ్నం పేదలకు అంబలి పోశారు. ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేశారు. తాజాగా కాగజ్‌నగర్ కేంద్రంగా రోజుకు వెయ్యిమందికి తగ్గకుండా... నిత్యన్నదానం చేస్తున్నారు. కేంద్రంలో అడుగుపెట్టగానే వేంకటేశ్వర సుప్రభాతం, భక్తిగీతాలు స్వాగతం పలుకుతాయి. అక్కడ ఉన్నంతసేపు.. ఏదో భక్తికేంద్రంలో ఉన్నామనే తృప్తి కలుగుతోంది.
కాగజ్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా నిత్యన్నదానం సత్రం కొనసాగుతోంది. స్వయంగా ఎమ్మేల్యే సతీమణి రమాదేవి నేతృత్వంలో ప్రతి రోజు ఉదయం 8గంటలకే వంటల తయారుచేసే కార్యక్రమం ప్రారంభమవుతోంది. రోజుకు వెయ్యిమందికి తగ్గకుండా మధ్యాహ్నం భోజనం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కాగజ్‌నగర్, దహేగాం, సిర్పూర్(టి), బెజ్జూరు, పెంచికల్‌పేట, కౌటాల మండలాల నుంచి.. వివిధ పనులపై కాగజ్‌నగర్ వచ్చే సామాన్యులకు .. కోనప్ప పెడుతున్న మధ్యాహ్న భోజనం ఆకలిని తీరుస్తోంది.