కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కరోనా బాధితుల కోసం నాలుగు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 150 మందికి పైగా కరోనా బాధితులు కోలుకుంటున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలు ప్రస్తుతం అధ్వానంగా ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐసోలేషన్ కేంద్రాల ఆవరణలో గతంలో ఉండి వెళ్లిపోయిన వారు పడేసిన చెత్త... ఇప్పటి వరకు శుభ్రపర్చలేదు. చెత్త వల్ల దోమలు తయారై ఇతర రోగాలు ఎక్కడ వస్తాయో అని కొవిడ్ రోగులు ఆందోళన చెందుతున్నారు.
నిర్వాహణలో కనిపించిన డొల్లతనం
బాధితులను సెంటర్లలో దించే వరకు మాత్రమే వైద్య సిబ్బంది డ్యూటీ పూర్తి అవుతుంది. ఆ తర్వాత క్వారంటైన్ సెంటర్లను సంబంధిత అధికారులు ఎవరు పర్యవేక్షించకపోవటం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో నీటి సౌకర్యం లేదని ఎమ్మార్వోకు ఫిర్యాదు చేయగా.. తనకు సంబంధం లేదని చెబుతున్నాడని బాధితులు ఆరోపించారు.