తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని డీజీపీ మహేందర్ రెడ్డి (DGP Mahender reddy) అన్నారు. మావోయిస్టుల నియామకాలను అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు కట్టడికి 31 డిస్ట్రిక్ట్ గార్డ్స్ ఏర్పాటు చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అటవీ ప్రాంతంలో నిరంతరం కూబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని వివరించారు. కమ్యూనిటీ పోలీస్ ద్వారా ప్రజలకు నిరంతరం దగ్గరవడానికి కృషి చేస్తున్నారు. మావోల కట్టడి ఆపరేషన్‌లో పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాంతి భద్రతలకు నిలయంగా మారాలని, ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
లొంగిపోయిన వారికి పునరావాసం
కరోనా సోకిన మావోయిస్టులు లొంగిపోతే వైద్య సేవలు అందిస్తామని డీజీపీ పేర్కొన్నారు. లొంగిపోయిన వారిపై ఉన్న రివార్డులను వారికే ఇస్తామని తెలిపారు. మావోల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని లొంగిపోయేలా చూడాలని సూచించారు.
మావోయిస్టు సమస్య రాష్ట్రంలో పునరావృతం కాకుండా రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కొవిడ్ ఉద్ధృతంగా ఉన్న ఈ సమయంలో తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ హరిభూషన్ కొవిడ్‌తో మృతి చెందాడు. ఇప్పటికే ఎంతోమంది క్యాడర్స్ మృతి చెందారు. వారితో పాటు మిగిలినవారు చనిపోకుండా ఉండాలంటే జనజీవన స్రవంతిలో కలవాలి.. పోలీసుల ఎదుట లొంగిపోవాలి. వారికి ఎలాంటి హాని జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. - మహేందర్ రెడ్డి, డీజీపీ.