తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండో రోజూ పోలీస్​బాస్​ మకాం... పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ - movoist news

అడవుల ఖిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున్న కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఏకంగా పోలీస్​బాస్ రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో సమీక్షిస్తున్నారు. బుధవారం రోజు ఆసిఫాబాద్​కు చేరుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి రెండో రోజు కూడా జిల్లాలోనే మకాం వేశారు. సర్వత్రా ఆసక్తి నెలకొన్నప్పటికీ పోలీసులు మాత్రం మౌనం వీడడం లేదు. దీంతో అసలు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.

2nd day of dgp mahender reddy visit in adilabad
2nd day of dgp mahender reddy visit in adilabad

By

Published : Sep 3, 2020, 9:06 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువయ్యాయని పోలీసులు చెబుతున్నారు. పార్టీలో రిక్రూట్​మెంట్​ కోసం మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరపు అడేళ్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గత నెల15న తిర్యాని మండలం తొక్కిగూడలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటు చేసుకోగా కీలక నేతలు తృటిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎదురుకాల్పుల అనంతరం రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి... అసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుని ఒకరోజు బసచేసి పోలీసులకు దిశానిర్దేశం చేశారు. నైరాశ్యం చెందకుండా ముందుకు సాగలంటూ ప్రోత్సాహించారు.

ప్రాధాన్యం సంతరించుకున్న డీజీపీ పర్యటన...

మావోయిస్టుల సంచారం తగ్గుముఖం పట్టిందనే తరుణంలో... అనుభవమున్న అధికారులు జిల్లాకు బదిలీ కావడం, పోలీసు బలగాలు అడవులను జల్లెడ పట్టడం... డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. డీజీపీతో పాటు రామగుండం కమిషనర్, ఆసిఫాబాద్ జిల్లా ఇంఛార్జ్​ ఎస్పీ సత్యనారాయణ, ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్... ఉమ్మడి జిల్లా అటవీ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పోలీస్ ఉన్నతాధికారులు మరో రెండు మూడు రోజులు జిల్లాలోనే మకాం వేయనున్నట్లు తెలుస్తుంది.

మరోవైపు మావోయిస్టుల కీలక నేత మాజీ కార్యదర్శి గణపతి లొంగుబాటు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం మౌనం వీడడం లేదు. ఉమ్మడి జిల్లాలో మావోయిస్టుల సంచారం మాత్రం నిజమేనని.. కొత్తవారెవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని... మావోయిస్టులకు ఎవరు సహకరించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసుల మౌనం వెనుక అంతర్యం ఏమిటన్నది అంతుబట్టడం లేదు.

ABOUT THE AUTHOR

...view details