నిరుద్యోగ వారంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడుతున్న వైఎస్ షర్మిల.. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో దీక్ష చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగించారు. పెనుబల్లి మండలం గంగాదేవిపాడులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుడు నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల.. బాధిత ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అనంతరం పెనుబల్లి మండల కేంద్రంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు.
రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకే ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేపట్టినట్లు షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రంలో కేవలం ఏడేళ్లలోనే దాదాపు నాలుగు రెట్లు నిరుద్యోగులు పెరిగారని ఆరోపించారు. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితమైనందునే యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా.. కేసీఆర్‌లో చలనం రావడం లేదని ఆక్షేపించారు. నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో తెలంగాణ ఒకటిగా ఉందని ఆమె గుర్తు చేశారు.