Sharmila tour in khammam: ఖమ్మం జిల్లా పాలేరు నుంచే ప్రతి గడపకూ నాటి వైఎస్ పాలనను గుర్తుచేసేలా ప్రభుత్వాన్ని అందిస్తామని వైతెపా అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వైఎస్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేందుకే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించామని తెలిపారు. ఖమ్మం గ్రామీణ మండలం పోలెపల్లి రెవెన్యూ పరిధిలోని కరుణగిరి సమీపంలో పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి తల్లి విజయమ్మతో కలిసి షర్మిల భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలో నిలుస్తానని పునరుద్ఘాటించారు. పాలేరు ప్రజల హక్కుల కోసం పోరాడుతానని, హక్కులు సాధించే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనకు పోరాడే శక్తి ఉందని, మాట కోసం నిలబడే నిజాయితీ, సేవ చేయాలన్న తపన ఉందన్నారు. ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినా.. ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం నిలబడతామని వెల్లడించారు.