కరోనా నేపథ్యంలో ఎవరైనా మృతిచెందితే అంత్యక్రియలకూ అవస్థలు తప్పడం లేదు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లికి చెందిన వ్యక్తి (50) ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా కరీంనగర్ జిల్లా అంబర్‌పేటలో పనిచేస్తున్నారు. సోమవారం గుండెపోటుతో మృతి చెందారు.
మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు స్వగ్రామమైన కొత్త లంకపల్లిలోని అతని సోదరుడి ఇంటికి తరలించారు. కరోనాతో చనిపోయాడనే అనుమానంతో మృతదేహాన్ని గ్రామంలో ఉంచేందుకు స్థానికులు, సోదరుడి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారు. మృతుని అత్తగారి ఇల్లున్న సత్తుపల్లికి తరలించగా.. అక్కడా స్థానికులు అడ్డుకున్నారు.
రాత్రంతా అంబులెన్సులోనే
మృతదేహాన్ని అంబులెన్సులో సత్తుపల్లి వైద్యశాలలో సోమవారం రాత్రంతా ఉంచారు. మంగళవారం ఉదయం తిరిగి కొత్త లంకపల్లికి తరలించగా.. స్థానికులు మరోసారి అడ్డుకున్నారు.
ఆ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించిన అంశాన్ని వీఎం బంజర్ ఎస్సై నాగరాజు నచ్చజెప్పడంతో అంత్యక్రియలకు స్థానికులు అంగీకరించారు. మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రెండు రోజులుగా ఇంటి ముందే మృతదేహం
కరోనాతో చనిపోయిన వ్యక్తిని ఖననం చేసేందుకు వీల్లేదని స్థానికులు అభ్యంతరం తెలపడంతో రెండు రోజులుగా మృతదేహం ఇంటి ముందే ఉండిపోయింది.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలోని శాటిలైట్ సిటీ ఏ-బ్లాకుకు చెందిన వ్యక్తి (61) తీవ్ర ఆయాసంతో సోమవారం ఉదయం మరణించారు.
ఆయన మృతదేహానికి కరోనా పరీక్ష చేయించాలని స్థానికులు పట్టుబట్టారు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. మృతదేహాన్ని ఖననం చేసేందుకు స్థానిక రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది డి-బ్లాకులోని శ్మశానవాటికలో గొయ్యి తీస్తుండగా.. ఏ-బ్లాకులో చనిపోతే డి-బ్లాకులో ఎలా ఖననం చేస్తారంటూ స్థానికులు అడ్డుకున్నారు. మంగళవారం మరోమారు అడ్డుకోవడంతో రాత్రి వరకూ మృతదేహాన్ని ఫ్రీజర్‌లోనే ఉంచారు.