పాఠశాలలు పున:ప్రారంభమవుతున్నా సర్కారు బడుల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఏ విద్యాలయాన్ని చూసినా శిథిల భవనాలు, కూలిన గోడలు, పనిచేయని చేతిపంపులు దర్శనమిస్తున్నాయి. పిల్లలను ఆకర్షించేలా ఉండాల్సిన సర్కారీ బడులు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఏటా వసతులు మెరుగుపడతాయని ఆశిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. ప్రభుత్వ పాఠశాలలు ఇలాంటి దుస్థితిలో ఉన్నా... అటు అధికారులు గానీ... ఇటు సర్కారు పెద్దలు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఉపాధ్యాయుల కొరత
ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో 199 ప్రాథమిక, 54 ప్రాథమికోన్నత, 34 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు 26,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొణిజర్ల, కారేపల్లి మండలాల్లో ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నప్పటికీ వారికి సరిపడా సౌకర్యాలు లేవు. ఉన్నత పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు, పీఈటీలు లేక ఏళ్లుగా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అవసరానికి సరిపడా తరగతి గదులు లేవు. మరుగుదొడ్లు, వంటగదులు మంజూరైనా వాటి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు.